అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో మోటార్ కార్మికుల మెడకు ఉరి తగిలించే విధంగా జీవో నంబర్లు 21, 31ను తీసుకురావడం వల్ల రూ.100 ఉన్న ఫైన్ రూ.వేలల్లో పడుతుందని, తక్షణమే జీవోను రద్దు చేయాలని ఏపీ ఆటో డ్రైవర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)జిల్లా అధ్యక్షుడు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం, కుటుంబ రక్షణకు సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, డ్రైవర్ల సంక్షేమానికి కావలసిన నిధులు కేటాయించాలని, 60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లకు నెలకు రూ.10వేలు పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రభుత్వాలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్‌తో కూడి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి పథకం వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని, సహాజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.10 లక్షలు ఉచిత బీమా పాలసీ అమలు చేయాలని, హెవీ వెహికల్ డ్రైవర్లకు నెలకు రూ.36 వేలు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్‌బేగ్, చంద్రరావు, బాలు.వై.రాజు, అప్పన్న దొర, పి.వెంకటేష్, లోవరాజు పాల్గొన్నారు.


