సరుగుడు...నష్టాలకు విరుగుడు | - | Sakshi
Sakshi News home page

సరుగుడు...నష్టాలకు విరుగుడు

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

● పెరుగుతున్న విస్తీర్ణం ● మొగ్గు చూపుతున్న రైతులు ● వరి, చెరకుకు ప్రత్నామ్నాయంగా సాగు

చోడవరం: ఈ ఏడాది సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మెట్ట ప్రాంతాలకే పరిమితమైన సరుగుడు సాగు ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోను, పల్లపు ప్రాంతాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో ఈ ఏడాది వరి, చెరకు సాగు తగ్గింది. వీటి స్థానంలో తక్కువ ఖర్చుతో సాగయ్యే సరుగుడు వేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చేపుతున్నారు. దీనితో సరుగుడు నారుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. చోడవరం నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి, చెరకు. ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణం ఏటా 21వేల 500 ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. సరుగుడు సాగు 6వేల ఎకరాల్లో జరిగేది. అయితే ఈ ఏడాది సరుగుడు సాగు ఏకంగా 10వేల ఎకరాలకు పైబడి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సకాలంలో వర్షాలు పడకపోవడం, మరో పక్క వరి నారు ముడుగులు ఆశించిన స్థాయిలో నీరు, నారు లేకపోవడంతో ఆదిలోనే వరి సాగుకి నారు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాకుండా సబ్సిడీపై అందాల్సిన డీఏపీ ఎరువును ప్రభుత్వం అనుకున్నంతగా అందించలేకపోయింది. వీటికితోడు దమ్ములు, ఉడుపులకు యంత్రాలు, ట్రాక్టర్లు, కూలీలకు అయ్యే ఖర్చు నాట్లు సమయంలోనే ఎకరాకి రూ.15 నుంచి 20 వేలకు ఖర్చవుతుండడంతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ రెండు పంటలకు ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. మరో పక్క గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ రెండేళ్లుగా క్రషింగ్‌ చేయకుండా మూసివేయడంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా ఖర్చులేకుండా ఒకసారి ఉడిస్తే 4,5 యేళ్లు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒకేసారి మొత్తంలో డబ్బులు వచ్చే వాణిజ్య పంట అయిన సరుగుడుపై ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జోరుగా సరుగుడు నారు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరుగుడు సాగు చేసేవారు సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో నారు కొరత ఏర్పడింది. ఒక్కో మొక్క 80 పైసలు నుంచి రూపాయి ఉండగా ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూపాయి 20 పైసలకు అమ్ముతున్నారు. అయినా నారుకోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ తెచ్చి రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఆహార పంటలైన వరి, చెరకు సాగు తగ్గడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement