మార్కెట్‌లోకి ‘హెచ్‌పీ నవ్య’ గ్యాస్ సిలిండర్
తేలికగా.. పారదర్శకంగా పాలిమర్‌తో నిర్మాణం
గ్యాస్ ఎంత ఉందో చూసుకునేకొత్త సిలిండర్
10 కేజీల కాంపోజిట్ సిలిండర్‌లాంఛనంగా ఆవిష్కరణ
సాక్షి, విశాఖపట్నం: బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారా.? సిలిండర్ మోసుకురావాలంటే అలిసిపోతున్నారా.? ఇకపై మీకు సమస్య లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు సిలిండర్ ఆర్డర్ పెట్టేసుకుంటే.. నిమిషాల వ్యవధిలో మీ ఇంట్లో వాలిపోతుంది. ఒక చోటు నుంచి మరో చోటికి సులువుగా, శ్రమ లేకుండా తీసుకెళ్లేలా మీ చేతిలో ఒదిగిపోతుంది. అదే.. హిందూస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీ) తీసుకొచ్చిన ‘నవ్య’మైన సిలిండర్. ఇప్పటికే బెంగళూరు, విజయవాడల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిలిండర్‌ను తాజాగా విశాఖ మార్కెట్‌లోకి కూడా ప్రవేశపెట్టారు. శివాజీపాలెంలోని రఘురాం గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం హెచ్‌పీ కంపెనీ ప్రతినిధులు 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ ‘హెచ్‌పీ నవ్య’ను లాంఛనంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.
ఏమిటీ ‘నవ్య’ ప్రత్యేకతలు.?
నవ్య సిలిండర్ పాలిమర్‌తో తయారు చేశారు. బరువు తక్కువ, భద్రత ఎక్కువ అన్న సూత్రంతో రూపొందిన ఈ సిలిండర్ ఈ జనరేషన్‌కి పర్‌ఫెక్ట్ మ్యాచ్ అని హెచ్‌పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ అత్యంత తేలికగా ఉండటమే కాకుండా అనేక ఆధునిక వసతులను కలిగి ఉందంటున్నారు.
గ్యాస్ ఎంత ఉందో చూసుకోవచ్చు!
గ్యాస్ ఉందా లేదా అనే టెన్షన్‌ని కూడా ఈ కొత్త సిలిండర్ లేకుండా చేస్తుంది. పాలిమర్ సిలిండర్‌లో మధ్యలో ఫైబర్‌గ్లాస్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. అందుకే ఇది పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల గ్యాస్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు మనం చూసుకునే వెసులుబాటు ఉన్న ఒక స్మార్ట్ కాంపోజిట్ సిలిండర్ ఇది. దీంతో రీఫిల్ బుకింగ్ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌తో రూపుదిద్దుకోవడం వల్ల తుప్పు పట్టే సమస్య ఉండదు. ప్రమాదాల బారిన పడకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో, పేలుడు సంభవించని రీతిలో దీనిని రూపొందించారు.
10 కేజీల సిలిండర్
ఇది 10 కిలోల సిలిండర్. అపార్టుమెంట్లు, చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటుగా అదనపు గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సిలిండర్ ధర ప్రాంతాన్ని అనుసరించి, మొదటిసారి కనెక్షన్ తీసుకున్నప్పుడు రూ.4,900 నుంచి రూ.5,002 వరకూ ఉంటుందని హెచ్‌పీ అధికారులు చెబుతున్నారు. తొలిసారి కొనుగోలు చేసినప్పుడు మాత్రం గుర్తింపు కార్డు, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఇక సులువే. దీని రీఫిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,700 వరకూ ఉంటుంది.
విశాఖ మార్కెట్‌లోకి ‘హెచ్‌పీ నవ్య’
మద్దిలపాలెం: హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ త్రివేది, ఎల్‌పీజీ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేందర్ సింగ్ చేతుల మీదుగా ‘హెచ్‌పీ నవ్య’ను శివాజీపాలెంలో గల రఘురాం గ్యాస్ ఏజెన్నీ వద్ద బుధవారం మార్కెట్‌లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు. అనంతరం సేల్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్‌డీ సేల్స్) ఆశీష్ సింఘాల్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత భద్రతతో పాటు సులభమైన వినియోగాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సిలిండర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం(ఎల్‌పీజీ సేల్స్) ఆర్.ఉమాపతి, చీఫ్ మేనేజర్ (కమర్షియల్) బి.వి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.


