అల్లూరి సీతారామరాజు జిల్లా | - | Sakshi
Sakshi News home page

అల్లూరి సీతారామరాజు జిల్లా

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

మండల కేంద్రాల చుట్టూ తిరిగే బాధలకు చెక్‌

కొండలు, గుట్టలు దాటే కష్టాలకు తెర

స్థానికంగానే ప్రభుత్వ సేవలు

ప్రభుత్వం–ప్రజల మధ్య తగ్గిన దూరం

గిరిజన గ్రామాలకు చేరువైన పాలన

సర్టిఫికెట్ల నుంచి సంక్షేమ పథకాల వరకు

గ్రామంలోనే అందుతున్న సేవలు

సమయం, వ్యయ ప్రయాసలు ఆదా

I

శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026

గాంధీ మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో మార్పులకు నాంది పలికింది. గతంలో చిన్నచిన్న ప్రభుత్వ సేవల కోసం మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈనేపథ్యంలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థతో అన్ని సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయి.

ముంచంగిపుట్టు: గ్రామ సచివాలయ వ్యవస్థతో రేషన్‌, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాలు తదితర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలోనే వివిధ శాఖల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సచివాలయాలు కీలకంగా మారాయి.కొండలు, గుట్టలు దాటి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్లడం గిరిజనులకు గతంలో పెద్ద సవాలుగా ఉండేది. జిల్లాలో 11 మండలాల్లో 212 గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ పాలన పంచాయతీ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం–ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ పల్లె పాలనలో కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ముంచంగిపుట్టు సచివాలయంలో ప్రభుత్వ సేవలు పొందుతున్న గిరిజనులు

ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలి

నాపేరు కల్యాణం. మాది అత్యంత మారుమూల ప్రాంతమైన రంగబయలు పంచాయతీ జర్రెలపొదర్‌ గ్రామం. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గతంలో అటవీ, కొండల మార్గంలో కాలినడకన ప్రయాణించి రహదారి మార్గానికి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలోని డిపోకు చేరుకుని రేషన్‌ సరుకులు తీసుకునేవాళ్లం. అనంతరం 30 కిలోల బియ్యం బస్తాను మోసుకుంటూ మరో 10 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకునేవాళ్లం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనం ద్వారా గ్రామ సమీపానికే రేషన్‌ సరుకులు అందేవి. దీంతో రేషన్‌ కోసం వెళ్లే దూరం సుమారు 7 కిలోమీటర్లు తగ్గింది. కేవలం మూడు కిలోమీటర్లు నడిస్తేనే గ్రామానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించడంతో మళ్లీ పాత రేషన్‌ కష్టాలు మొదలయ్యాయి. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల సేవలను పునరుద్ధరించాలి.

వెంటనే ధ్రువపత్రాల మంజూరు

నా పేరు ఎం.నారాయణ. మాది కుమడ పంచాయితీ ముఖిపుట్టు గ్రామం.సచివాలయ వ్యవస్థ రావడం గిరిజన గ్రామాల్లో గిరిజనులకు అన్ని విధాలుగా మేలు జరిగింది. గతంలో కుల,ఆదాయ ధ్రువపత్రాల కోసం 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. వారం రోజులు రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగితేనే పని జరిగేది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత కేవలం ఒక రోజులోనే ధ్రువపత్రాలు మంజూరు అవుతున్నాయి.

రేషన్‌ ఇబ్బందులు మొదలు

నా పేరు కిరసాని సాధు. మాది మారుమూల వనుగుమ్మ పంచాయితీ పనస గ్రామం.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్‌ సరకులు ఎండీయూ వాహనాల ద్వారా అందించే వారు అందువల్ల ఇబ్బందులు తొలగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను తొలగించడం వల్ల మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పనస నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగడ డిపోకు వెళ్లితెచ్చుకోవాల్సి వస్తోంది. నిరీక్షణ, మోతకష్టాలు మొదలయ్యాయి. డిపోకు ఉదయం వెళ్తే ఇంటికి సాయంత్రం వస్తున్నాం.

గ్రామస్థాయిలో సేవలు

నా పేరు బోడ్నాయిక్‌ సిద్ధేశ్‌, మాది వనగుమ్మ. గత ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల వేగంగా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. అన్ని శాఖల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉంటున్నారు. కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్లు సులభంగా లభిస్తున్నాయి. పంచాయితీ కార్యదర్శి, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా జవాబుదారీతనం లభిస్తోంది. గ్రామసచివాలయ వ్యవస్థ వల్ల ఇబ్బందులు తొలగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement