స్వాతంత్య్ర పోరాటంలో బోనంగి పండుపడాల్ చెరగని ముద్ర
అజ్ఞాత జీవితం నుంచి అండమాన్ వరకు.. ఓ ఆదివాసీ వీరుడి విజయగాధ
నాటి పోరాటంలో ప్రాణాలు పణంగా పెట్టిన త్యాగమూర్తి
అండమాన్‌లో సిర్థపడిన కుటుంబ సభ్యులు
నేటికీ ఈ ప్రాంతంతో కొనసాగుతున్న అనుబంధం
అల్లూరి వెంటే
అల్లూరి వెంట అడుగులు.. బ్రిటీష్‌పై తిరుగుబాటు.. అజ్ఞాత జీవితం.. అండమాన్ జైలు.. చివరకు స్వాతంత్య్రం వచ్చినా స్వదేశానికి తిరిగి రాని ఓ మన్యం వీరుడి గాథ ఇది. ఆయనే బోనంగి పండుపడాల్. నాటి పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన కుటుంబ బంధం మాత్రం నేటికీ మన్యంతో కొనసాగుతోంది.
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన మన్యం వీరుల్లో బోనంగి పండుపడాల్ ఒకరు. జిమాడుగుల మండలం భీరం గ్రామంలో జన్మించిన పండుపడాల్ అక్క జనకాని రాములమ్మ వద్దకు చేరి, ఆమె పెంచిన జనకాని లింగమ్మను వివాహం చేసుకున్నారు. అప్పటికే బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సాగిస్తున్న పోరాటానికి ఆకర్షితుడై ఆయన వెంట నడిచారు.
●అల్లూరితో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపై జరిగిన దాడుల్లో పండుపడాల్ కీలక పాత్ర పోషించారు. అప్పటిలో కృష్ణదేవిపేటలో బ్రిటీష్ అధికారులు ఇద్దరిని అంతమొందించిన ఘటనలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో బ్రిటీష్ పాలకుల హిట్‌లిస్ట్‌లో చేరిన పండుపడాల్ అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది.
●పండుపడాల్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ సైన్యం ఆయన కుటుంబ సభ్యులను వేధించడంతో పరిస్థితులు విషమించాయి. చివరకు అక్క రాములమ్మ ఇంటికి విందుకు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిన పండుపడాల్‌ను బ్రిటీష్ సైన్యం అరెస్టు చేసింది. 1925 మేలో ఆయనకు మరణశిక్ష విధించారు. అనంతరం 1926లో అండమాన్ జైలుకు తరలించారు. స్వాతంత్య్రం అనంతరం విడుదలైన పండుపడాల్ స్వదేశానికి తిరిగి రాకుండా అండమాన్‌లోనే వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 1974 ఫిబ్రవరి 17న ఆయన మృతి చెందారు.
●ఏళ్లకు ఏళ్లు గడిచినా పండుపడాల్ కుటుంబానికి మన్యంతో ఉన్న అనుబంధం మాత్రం తెగిపోలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా ఆయన వారసులు గొందిపాకలు గ్రామంలో ఉన్నట్లు గుర్తించి 2010లో కుటుంబ సభ్యులను కలిశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పండుపడాల్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు రాకపోకలు సాగిస్తున్నారు. గొందిపాకలు గ్రామానికి చెందిన ఆయన మనుమలు జనకాని రామారావు, జనకాని కనకారావు కుటుంబ సభ్యులు సైతం అండమాన్‌లోని పండుపడాల్ కుటుంబాన్ని కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.


