అధ్యాపకుల తొలగింపుతో తరగతులకు బ్రేక్ రూ.కోట్ల ఆదాయం తెచ్చే కోర్సులకు మంగళం! టీటీఏలపై విజిలెన్స్ రెండు కళ్ల సిద్ధాంతం గవర్నర్ జోక్యం చేసుకోవాలని విద్యార్థుల డిమాండ్
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలకవర్గం అనుసరిస్తున్న విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒకరిపై కక్ష సాధింపు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం వర్సిటీ ప్రతిష్టనే మసకబారేలా చేస్తున్నాయి. ప్రధానంగా వివిధ సాకులతో సీనియర్ అధ్యాపకుల తొలగింపు చర్యలు ఏయూలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, లా వంటి కీలక కోర్సుల్లో సీనియర్ అధ్యాపకులను రకరకాల కారణాలు చూపి తొలగించడంతో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఈ వ్యవహారంపై తక్షణమే దృష్టి సారించాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
956 పోస్టులకుగాను.. ఉన్నది 194 మందే!
ఏయూలో గత కొన్నేళ్లుగా శాశ్వత అధ్యాపకుల నియామకాలు జరగకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. విశ్వవిద్యాలయంలో మొత్తం 956 మంజూరైన అధ్యాపక పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 194 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈ విద్యా సంక్షోభాన్ని అధిగమించడానికి, నాక్ ప్రమాణాలను కాపాడుకోడానికి గత యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదంతో ఇంజినీరింగ్, న్యాయశాఖ, జియాలజీ, పర్యావరణ శాస్త్రాలు, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో అడ్జంక్ట్(కాంట్రాక్ట్) అధ్యాపకులను నియమించింది. గతంలో పర్యటించిన నాక్ బృందం కూడా ఈ తాత్కాలిక బోధనా పద్ధతిని అభినందించడం విశేషం.
విజిలెన్స్ సాకుతో వేటు..
కోర్సులకు ముకుతాడు
ప్రస్తుత ఉపకులపతి విజిలెన్స్ అభ్యంతరాలను సాకుగా చూపుతూ అడ్జంక్ట్ అధ్యాపకుల సేవలను నిలిపివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బోధన అందిస్తున్న వారిని తొలగించే అధికారం విజిలెన్స్‌కు లేకపోయినా, కావాలనే వారిని పక్కనపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో గత 15 రోజులుగా క్లాసులు జరగడం లేదు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, లా విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ విభాగాలు వర్సిటీకి ఏడాదికి రూ. 50 కోట్లు, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న కోర్సులను నిర్వీర్యం చేయడం వెనుక ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరోక్షంగా లబ్ధి చేకూర్చే వ్యూహం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజిలెన్స్ ‘రెండు కళ్ల సిద్ధాంతం’?
అడ్జంక్ట్ అధ్యాపకుల నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విజిలెన్స్.. ప్రస్తుతం తరగతుల నిర్వహణ కోసం వాడుకుంటున్న టీచింగ్ టెంపరరీ అసిస్టెంట్స్ (టీటీఏ) వ్యవస్థపై ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. టీటీఏల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నప్పటికీ.. విజిలెన్స్ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అంతర్యమేమిటని మండిపడుతున్నారు. అడ్జంక్ట్ అధ్యాపకుల విషయంలో ఒకలా, టీటీఏల విషయంలో మరోలా వ్యవహరిస్తూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఉత్తర్వులున్నా.. రివిజన్ పిటిషన్‌కా?
ఇటీవల అడ్‌హాక్, కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవల కొనసాగింపుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వర్సిటీ యాజమాన్యం ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తుండటం గమనార్హం. మరోవైపు, పాత కాంట్రాక్ట్ అధ్యాపకులకు సేవల పొడిగింపు ఇచ్చి.. 2019–2024 మధ్య కాలంలో నియమితులైన అడ్జంక్ట్, అడ్‌హాక్ అధ్యాపకుల పట్ల భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తుండడం గమనార్హం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం.. శతాబ్ది కాలంగా ఎందరో మేధావులను దేశవిదేశాలకు అందించిన విద్యాక్షేత్రం. కానీ నేడు ఆ ఘనకీర్తి కనుమరుగవుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న కక్షసాధింపు ధోరణులు.. నిబంధనల పేరిట కుంటి సాకులతో అధ్యాపకుల తొలగింపులు.. వర్సిటీ ఉనికికే ముప్పు తెస్తున్నాయి. వర్సిటీలో 956 అధ్యాపక పోస్టులకు గాను.. 194 మందే ఉన్నప్పటికీ.. ఉన్న ఆ కాస్త సిబ్బందిని విజిలెన్స్ సాకుతో రోడ్డున పడేస్తుండడంతో ఏయూలో బోధన పూర్తిగా పడకేసే ప్రమాదం పొంచి ఉంది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి.. రూ.కోట్ల ఆదాయం తెచ్చే కోర్సులకు మంగళం పాడేసి.. తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది.
విద్యార్థులకు నష్టం కలిగించొద్దు!
అధ్యాపకుల పూర్తిస్థాయి నియామకాలు జరగకుండా, ఉన్న తాత్కాలిక అధ్యాపకులను కూడా తొలగిస్తే ఇంజినీరింగ్, ఐటీ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? ప్రస్తుతం రోజుకు రెండు, మూడు క్లాసులు జరగడమే గగనంగా మారింది. ఇంజినీరింగ్ విద్యా బోధనలో ఏయూకి ఉన్న ప్రత్యేక ప్రతిష్టను చెడగొడుతున్నారు. ఉన్నత విద్యాశాఖ తక్షణమే స్పందించి అందరికీ ఒకే విధమైన పారదర్శక నిబంధనలు అమలు చేయాలి.
– వి.లక్ష్మి, జిల్లా కార్యదర్శి, పీడీఎస్‌వో


