స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన బోర్డు
మాకవరపాలెం : ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ కె.నూకరాజు తెలిపారు. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెంలో ఎల్‌పిఎం నంబర్ 279లోని 2.58 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించి సరుగుడు మొక్కలు వేస్తున్నారంటూ సోమవారం గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఈ భూమిని పరిశీలించి ప్రభుత్వ భూమి కావడంతో స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ తెలిపారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఆక్రమణదారుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


