ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ, మెట్టబాధిపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బిల్లుల మంజూరు కోసం డబ్బులు వసూలు చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పీఎం జన్‌మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు బిల్లులు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మెట్టబాధిపుట్టులో ఇళ్ల నిర్మాణం లింటల్, స్లాబ్ స్థాయికి చేరుకున్నా, గత ఐదు నెలలుగా నిధులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు అప్‌లోడ్ చేయడానికి హౌసింగ్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు అనేకసార్లు హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య ఆరోపించారు. సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు చంద్రయ్యతో పాటు పెద్ద సంఖ్యలో హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.


