జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం
అధికారులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు : గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. జిల్లాలో విద్యా, ఆరోగ్యం, పౌష్ఠికాహారం, తాగునీరు, పారిశుద్యం, పరిశుభ్రత తదితర అంశాలపై యునిసెఫ్ టీం సభ్యులు, జిల్లా శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలింతలు, చిన్నారులలో రక్తహీనత తగ్గించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన ఆరోగ్యం, పోషకాహారం అందిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా డ్రాపౌట్స్ తగ్గిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఆధునిక విద్యా విధానాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని యునిసెఫ్ టీం క్షేత్ర స్థాయిలో ఇచ్చే సలహాలు, సూచనలు అమలు చేయాలని సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి యునిసెఫ్ సహకారంతో బహుళ రంగాల సమన్వయంతో గిరిజనుల అభ్యున్నతికి ఆయా శాఖల కృషి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో యునిసెఫ్ సంస్థ రాష్ట్ర చీఫ్ ఆఫీసర్ డాక్టర్ జీలాలేం తాఫస్సే, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఖ్యతి తివారీ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


