వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం
రంపచోడవరం: ఏజెన్సీలో వైద్య సేవలకు వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్‌ను ప్రారంభించారు. రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లో అంబులెన్స్ అవసరం ఉందని ఎమ్మెల్సీ అనంతబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు అరకు ఎంపీ తనూజరాణి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె వెంటనే స్పందించారు. ఎంపీ నిధుల నుంచి చింతూరు, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు రెండు అంబులెన్సులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలను దగ్గర చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చి, నిర్మాణం చేపట్టిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు. గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంధం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, స్ధానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ అధ్యక్షుడు జల్లేపల్లి రామన్నదొర, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, కాజా వలీ, పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, పార్టీ నాయకులు కుంజం రామకృష్ణ, రత్నరాజు, బొబ్బా శేఖర్, చితుకులయ్యరెడ్డి, నాగేశ్వరరావు,రాజన్నదొర,బాబి, యూత్ అధ్యక్షుడు పండు, సత్తిబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


