51 సెల్‌ఫోన్ల రికవరీ
● విలువ రూ.5.45 లక్షలు ● ఎస్పీ అమిత్‌బర్దర్
బాధితులకు సెల్ ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్
పాడేరు : జిల్లా వ్యాప్తంగా పలువురు పోగొట్టుకున్న విలువైన మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రికవరి చేసినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్ తెలిపారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు నెలల కాలంలో బాధితులు పోగొట్టుకున్న రూ.5.45లక్షల విలువైన 51 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.27లక్షల విలువైన 180 ఫోన్లను రికవరి చేసి బాధితులకు అప్పగించామన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన www.ceir.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి Loss Mobile అనే ఆప్షన్ ద్వారా ఐ MEI నంబర్, ఫోన్ మోడల్ వివరాలు నమోదు చేస్తే పోలీస్ శాఖ సాంకేతికతను ఉపయోగించి ఫోన్ ఎక్కడుందో తెలుసుకుంటామన్నారు. ఈ సేవలను మొబైల్ ఫోన్ల బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్ల రికవరీలో విశేష కృషి చేస్తున్న స్పెషల్ బ్రాంచి సీఐ బి. అప్పలనాయుడును ఎస్పీ అభినందించారు.


