
రహదారిపై నాట్లు వేసి నిరసన
ఎటపాక: అధ్వానంగా మారిన రహదారిని మెరుగుపరచండి అంటూ మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. కృష్ణవరం పంచాయతీ పరిధి చింతలచెరువు గిరిజన గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. వర్షం పడితే పరిస్థితి దారుణంగా ఉంటోంది. అధికారులకు ఎన్నోసార్లు రహదారి దుస్థితి తెలియజేసినా వారు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి తీరును నిరసిస్తూ బురదమయంగా ఉన్న రహదారిపై మంగళవారం వరినాట్లు వేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని వారు కోరారు.