
కిల్లంకోట దళం కలకలం
సాక్షి,పాడేరు: మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఏవోబీలో కదలికలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరిహద్దులో ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసు నిర్బంధం అఽధికంగా ఉన్నట్టుగా భావించిన పోలీసులు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారనే అనుమానంతో అప్రమత్తమయ్యారు.
● ఇటీవల వై.రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల కీలకనేతలు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమవడం తెలిసిందే. పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి,మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాలపై మళ్లీ మావోయిస్టులు పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసుశాఖ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
● పెదబయలు–జి.మాడుగుల అటవీ ప్రాంతాలకు సరిహద్దులో ఉన్న కిల్లంకోట పేరుతో మావోయిస్టు పార్టీ కొత్త దళం ఏర్పాటును తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనిలో భాగంగా కిల్లంకోట దళానికి చెందిన నలుగురు మావోయిస్టుల్లో ముగ్గురు తప్పించుకోగా, పెదబయలు–కోరుకోండ ఏరియా కమిటీకి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు చైతో (నరేష్)ను ఈనెల 16న పోలీసు బలగాలు పట్టుకున్నాయి. పిస్టల్ ( 9ఎంఎం)తో పాటు మూడు కిటు బ్యాగులు, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కీలక నేతలు,సభ్యులు పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ పరిధిలో అఽధికంగా సంచరిస్తూ కొత్త దళాలను ఏర్పాటుచేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
● ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు క్యాడర్ అధికంగా ఉందని భావిస్తున్న పోలీసు బలగాలు జిల్లాతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మురం చేశాయి. అటువైపు నుంచి ఒడిశా పోలీసు బలగాలు కూడా అటవీ ప్రాంతంలో మకాం వేశాయి. మరోపక్క అవుట్ పోస్టుల పోలీసు పార్టీలు కూడా డేగకన్నుతో వ్యవహరిస్తున్నాయి. ప్రశాంతంగా ఉందని పోలీసుశాఖ ఊపిరి పీల్చుకున్న తరుణంలో మావోయిస్టుల సంచారం, కొత్త దళాల ఏర్పాటు ప్రచారంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.
ఏవోబీలో మళ్లీ మావోయిస్టుల
కదలికలు
అప్రమత్తమైన పోలీసు బలగాలు
గాలింపు చర్యలు ముమ్మరం
నెలకొన్న యుద్ధవాతావరణం