
మిగిలిన పింఛను సొమ్ము సత్వరమే జమ చేయండి
పాడేరు : లబ్ధిదారులకు చెల్లించగా మిగిలిన సామాజిక పింఛన్ల సొమ్మును తిరిగి ప్రభుత్వానికి సత్వరమే చెల్లించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి డీఆర్‌డీఏ, డ్వామా, గిరిజన సంక్షేమ విద్యా శాఖ, గ్రామ వార్డు సచివాలయం, ఎస్‌ఎంఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ పరిధిలోని వెల్పేర్ అసిస్టెంట్ల నుంచి రికవరీ రికవరి చేయాలన్నారు. సీ్త్ర నిధి రుణాలు 10,686 రికవరీ చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎస్‌ఎంఐ శాఖకు రూ.20కోట్లతో 155 చెక్‌డ్యాంలు మంజూరు చేశామన్నారు. వీటిని నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయుల్లేని పాఠశాలలకు సమీపంలో ఉన్న వాటి నుంచి సర్దుబాటు చేయాలన్నారు. సర్దుబాటు చేసిన టీచర్లు సక్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా అనేది ఏటీడబ్ల్యూవోలు పర్యవేక్షించాలన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. పాఠశాలల్లో కచ్చితంగా 98 శాతం హాజరు ఉండాలన్నారు. పాఠశాలల ఆడిట్ వేగంగా పూర్తి చేయాలని ఎంఈవోలను ఆదేశించారు. గ్రామ సచివాలయాల పరిధిలో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. తాగునీటి వనరులకు క్లోరినేషన్ సక్రమంగా చేయాలని దోమల మందు పిచికారి త్వరగా పూర్తి చేయాలన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, డీఆర్‌డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ ఇన్‌చార్జి డీడీ క్రాంతికుమార్, డీఈవో బ్రహ్మాజీరావు, డీపీవో చంద్రశేఖర్, డ్వామా పీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ