
జోలాపుట్టు నీటి నిల్వల పరిశీలన
● అప్రమత్తంగా ఉండాలి
● దిగువ గ్రామాల గిరిజనులకు
తహసీల్దార్ సూచన
ముంచంగిపుట్టు: జోలాపుట్టు, డుడుమ జలాశయాల దిగువ గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె.శంకరరావు సూచించారు. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జోలాపుట్టు జలాశయం నీటి నిల్వలను మంగళవారం ఆయన పరిశీలించారు. జలాశయ సిబ్బంది నుంచి ఇన్‌ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా ప్రస్తుతం 2745.30గా ఉందని, రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.దీనిపై సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ వారిని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ డుడుమ, జోలాపుట్టు జలాశయాల నీటి విడుదలపై దిగువ ఉన్న మాకవరం, వనుగుమ్మ, రంగబయలు, జోలాపుట్టు, దొడిపుట్టు పంచాయతీలకు చెందిన 30 గ్రామాలను అప్రమత్తం చేశామన్నారు. తుపాను వల్ల ఎటువంటి నష్టాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసరసాయం నిమిత్తం గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. తుపాను తగ్గుముఖం పట్టేంతవరకు నాటుపడవ ప్రయాణాలు చేయవద్దని ఆయన మత్స్యగెడ్డ పరివాహిక గ్రామాల గిరిజనులను కోరారు.