
నరకం చూస్తున్నాం..
ముంచంగిపుట్టు: జిల్లా స్థాయి అధికారుల తొందరపాటు నిర్ణయాల వల్ల గిరిజన విద్యార్థులు నరకం చూస్తున్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే అక్కడికి విద్యార్థులను అధికారులు తరలించారు. రెండు రోజులపాటు సమస్యలతో ఇబ్బందులు పడిన విద్యార్థినీ విద్యార్థులు మంగళవారం ఆవేదనకు గురై రోదించారు. ఇన్ని సమస్యల మధ్య ఎలా చదువుకోవాలంటూ బయటకు వచ్చి నినాదాలు చేశారు. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా మీ బాధలు మీరు పడండి అంటూ నరకంలోకి తీసుకువచ్చి వదిలేశారని వారు వాపోయారు. రోదిస్తూ ఫోన్లలో తల్లిదండ్రులకు తమ బాధను తెలియజేశారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుంటే ఇళ్లకు వెళ్లిపోతామని విద్యార్థులు హెచ్చరించారు.
లబ్బూరు ఏకలవ్య పాఠశాల
విద్యార్థినుల ఆవేదన
కనీస వసతులు కల్పించకుండా
ఇబ్బందులు పాల్జేస్తున్నారని రోదన
ఉన్నతాధికారులు స్పందించకుంటే ఇళ్లకు వెళ్లిపోతామని హెచ్చరిక