మహానాడు సాక్షిగా బయటపడిన వర్గ విభేదాలు
పాడేరు : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పాడేరులో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మహానాడు సాక్షిగా పార్టీలో నెలకొన్న వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు గైర్హాజయ్యారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మత్స్యరాస మణికుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు, రాష్ట్ర కార్యదర్శి, పాడేరు సర్పంచ్ సోదరుడు కొట్టగుళ్లి సుబ్బారావు తదితర నాయకులు ముఖం చాటేశారు. నాయకుల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటని కార్యకర్తలు మాట్లాడుకోవడం కనిపించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, బొర్రా నాగరాజు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన తమలాంటి నాయకులకు నామినేటేడ్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన మహానాడు పరిశీలకులు హర్షవర్ధన్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండాలన్నారు. పనిచేయని అధికారులు, ఉద్యోగులను కార్యకర్తలు గట్టిగా నిలదీయాలని తెలిపారు. అనంతరం జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు పలు తీర్మానాలు చేశారు. మహానాడు ఆ పార్టీ కేడర్‌లో ఏ మాత్రం జోష్ నింపలేదు. కార్యక్రమాలను తూతూ మంత్రంగా ముగించారు.
ముఖం చాటేసిన నియోజకవర్గ
ముఖ్య నేతలు
తూతూమంత్రంగా ముగిసిన
కార్యక్రమాలు
పార్టీ నేతల మధ్య సమన్వయం
లేదని కార్యకర్తల అసంతృప్తి


