విశాఖ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
ఏయూక్యాంపస్ (విశాఖ): నగరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రాబల్యం అధికంగా ఉందని, కార్మిక శక్తి ఈ నగరానికి వెన్నెముక అని వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ మైదానంలో జరుగుతున్న సీఐటీయూ ‘శ్రామిక ఉత్సవ్’ రెండో రోజు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 1970లో ప్రారంభమైన సీఐటీయూ కార్మిక హక్కుల సాధనలో ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు. కార్మిక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ సాను కూలంగా స్పందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖను పారిశ్రామికంగానే కాకుండా ఐటీ, పర్యాటక రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తర్లువాడలో గూగుల్ కార్యకలాపాలు, కాపులుప్పాడ, మధురవాడల్లో ఐటీ హబ్‌ల విస్తరణతో పాటు నగరాన్ని ‘అడ్వెంచర్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలోని 50 మురికివాడలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. కార్మికుల సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధికి లేబర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాంగణంలోని పుస్తక ప్రదర్శనను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కళాకారులను అభినందించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు వి.కృష్ణయ్య, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, జిల్లా కన్వీనర్ మణి, శ్రామికత ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ, అల్లూరి హాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి నరసింహ రాజు పాల్గొన్నారు.


