సీలేరులో ఆశ్రమ విద్యార్థిని మృతి
● రక్తహీనతే కారణం
● వార్డెన్ నాగ శకుంతల వెల్లడి
సీలేరు: స్థానిక ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పాంగి నందిని (11) ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమెకు శనివారం జ్వరంగా ఉండడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లామని ఆశ్రమ పాఠశాల వార్డెన్ పి.నాగ శకుంతల తెలిపారు. అక్కడ పరీక్షించిన సిబ్బంది జ్వరం లేదని, హిమోగ్లోబిన్ 4.5 శాతం మాత్రమే ఉన్నందున రక్తం ఎక్కించేందుకు చింతపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వారు సూచించారన్నారు. వెంటనే అక్కడి నుంచి నందిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఉదయం చింతపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి ఉన్నందున పాఠశాలకు రావాలని వారికి సూచించామన్నారు. అనంతరం అక్కడి నుంచి నందినిని ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లిపోయామన్నారు. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం నందిని ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్లామని చెప్పారు. పరీక్షించిన వైద్యాధికారి నారాయణరావు అప్పటికే ఆమె మృతి చెందినట్టు చెప్పారని వార్డెన్ తెలిపారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. గుండెలవిసేలా రోదించారు. బాలిక మృతదేహాన్ని గాలికొండ పంచాయతీ గేజింగ్ గ్రామానికి అంబులెన్సులో తరలించారు. ఇలావుండగా ఆశ్రమ విద్యార్థిని నందిని మృతిపై కలెక్టర్ దినేష్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


