హౌస్‌ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

హౌస్‌ఫుల్‌

Dec 29 2025 7:55 AM | Updated on Dec 29 2025 7:55 AM

హౌస్‌

హౌస్‌ఫుల్‌

పర్యాటకం
భారీగా తరలివస్తున్న సందర్శకులు
ఆంధ్రా కశ్మీర్‌ కిటకిట

విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు

గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక

బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు

జనవరి రెండో వారం వరకూ నిండిపోయిన హోటళ్లు, రిసార్టులు

గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న ఉమ్మడి విశాఖ

కాలం మారుతోంది.. ఏడాది వీడ్కోలు పలకనుంది.. కానీ ఉమ్మడి విశాఖ అందం మాత్రం రెట్టింపవుతోంది. సముద్రపు అలల మధ్య కేరింతలు కొట్టేందుకు, మన్యం అడవుల్లో ప్రకృతిని పలకరించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా పర్యాటక కేంద్రాలన్నీ సందర్శకులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ‘హౌస్‌ఫుల్‌’ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనాల రద్దీ కారణంగా అరకు, పాడేరు ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ఆంక్షలు

విధించారు. ఉమ్మడి విశాఖ పర్యాటకంలో ఇదో కొత్త అధ్యాయంగా నిలువనుంది.

ఇబ్బందులు లేకుండా చర్యలు

ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌

జీవీబీ జగదీష్‌

ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఘాట్‌ రోడ్లలో ప్రయాణంపై

ముందస్తు ఆంక్షలు

అరకులోయ టౌన్‌: విశాఖ–అరకు ఘాట్‌రోడ్‌లో ప్రయాణించే వారంతా పోలీస్‌ ఆంక్షలు పాటించాలని ఎస్‌ఐ గోపాల్‌రావు సూచించారు. అరకులోయకు వచ్చే పర్యాటకులు తిరుగు ప్రయాణంలో అరకులోయ నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నానికి వెళ్లాలన్నారు. విశాఖ–అరకు ఘాట్‌రోడ్డులో పర్యాటకుల తాకిడి పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా గాలికొండ వ్యూపాయింట్‌, సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అరకులోయకు వచ్చే పర్యాటకులంతా తిరుగు ప్రయాణంలో పాడేరు మీదుగా వెళ్లాలని ఎస్‌ఐ సూచించారు.

సాక్షి, విశాఖపట్నం : మారిపోతున్న క్యాలెండర్‌ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక జాతర మొదలైంది. ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్‌ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి.

హోటళ్లు ఫుల్‌.. నో వేకెన్సీ.!

విపరీతమైన పర్యాటకుల రద్దీ కారణంగా నగరంలోని స్టార్‌ హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

25 శాతం పెరిగిన పెరిగిన పర్యాటకం

గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్‌ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్‌, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది.

● మరోవైపు మన్యం అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చలిగాలుల గిలిగింతలు, దట్టమైన పొగమంచు దుప్పటిని చీల్చుకుంటూ అరకు లోయ, లంబసింగి, వంజంగి మేఘమాలల వైపు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. పాడేరు ఘాట్‌ రోడ్లు, కాఫీ తోటలు, చాపరాయి జలపాతాలు పర్యాటకుల రాకతో కళకళలాడుతున్నాయి.

చాపరాయి జలవిహారి, జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు

చింతపల్లి: ఆంధ్రా కశ్మీరు లంబసింగికి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక్కడి సమీపంలోని చెరువులవేనం వ్యూపాయింట్‌ సందర్శకులతో కిటకిటలాడింది. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ, గిరిజనులతో థింసా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సాహస క్రీడలకు నెలవైన తాజంగి జలాశయ పరిసరాలు పర్యాటకుల రాకతో కళకళలాడాయి. లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ క్షేత్రాలను సందర్శించారు. పండ్లను కొనుగోలు చేశారు.

తారాబుకు తాకిడి

పెదబయలు: మండలంలోని తారాబు ( పిట్టల బొర్ర) జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువయ్యింది. ఆదివారం పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి సందడి చేశారు. ఎక్కువగా ఒడిశా మీదుగా పర్యాటకులు వస్తున్నారు. వంజంగి. కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు జి.మద్దిగరువు మీదుగా ఇంజరి మీదుగా తారాబు జలపాతానికి వస్తున్నారు.

డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక ప్రదేశాలు చాపరాయి, అరకు పైనరీ సందర్శనకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. గిరిజన వస్త్రధారణలో తళుక్కుమన్నారు. ఇదే ప్రాంతంలో హైవేపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. వెంటనే స్థానిక ఎస్‌ఐ సురేష్‌ తన సిబ్బందితో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

మురిసిన వంజంగి

పాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. పాడేరు, వంజంగి ప్రాంతాల్లోని హోటల్లు, రిసార్టులు, క్యాంపెయిన్‌ టెంట్లలో బస చేశారు. ఆదివారం తెల్లవారు జామున కొండపైకి బయలుదేరి వెళ్లారు. సూర్యోదయం అందాలను తిలకించారు. అరకు ఘాట్‌ మార్గం పర్యాటకులు, వాహనాలతో పూర్తిగా

కిక్కిరిసి పోయింది. దీంతో పర్యాటకుల ట్రాఫిక్‌ను పాడేరు వైపు మళ్లించారు.

హౌస్‌ఫుల్‌1
1/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌2
2/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌3
3/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌4
4/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌5
5/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌6
6/7

హౌస్‌ఫుల్‌

హౌస్‌ఫుల్‌7
7/7

హౌస్‌ఫుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement