
కేజీహెచ్‌లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
డాబాగార్డెన్స్: కేజీహెచ్‌లో 16 ఏళ్ల బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఏవీఎన్ కళాశాల డౌన్ రోడ్డులో నివాసముంటున్న యశ్వంత్ రెండేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లి సంతోషి కేజీహెచ్ వైద్యులను ఆశ్రయించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు జీవన్‌దాన్ ద్వారా కిడ్నీ మార్పిడికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేజీహెచ్‌లో ఆ బాలుడికి ఈ నెల 7న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కేజీహెచ్‌లో దీన్ని ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. అలాగే రోగికి రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల విలువైన మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాంబాబు, అనస్థీసియా డాక్టర్లు శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రీతి, డాక్టర్ రమేష్, నర్సింగ్ సిబ్బంది సూర్యప్రభ, చంద్రకళ, ఇతర సహాయక సిబ్బంది ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు సూపరింటెండెంట్ వివరించారు.