గుర్తేడుపై పోలీస్ గురి
రంపచోడవరం: అల్లూరి మన్యంలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. వై.రామవరం మండలంలో గుర్తేడు పోలీస్ స్టేషన్ మొదటి నుంచి మారేడుమిల్లిలోనే కొనసాగుతోంది. తాజాగా గుర్తేడులోనే తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పోలీసులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. గత 20 ఏళ్లుగా మారేడుమిల్లిలోనే కొనసాగుతున్న గుర్తేడు స్టేషన్‌ను ఒక్కసారిగా గుర్తేడులో ఏర్పాటు చేయడంతో ఏజెన్సీలో చర్చ జరుగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టులపై నిర్బంధకాండ కొనసాగడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు గుర్తేడులో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి అక్కడ గిరిజనులు, యువతతో మమేకమయ్యారు. గుర్తేడులోనే రాత్రి బస చేశారు.
40 మంది మావోయిస్టుల సంచారం!
ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టు కదలికలతో అల్లూరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ పోలీసులు గుర్తేడు, పాతకోట, సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు కీలక నేత కాకూరి పండయ్య అలియస్ జగన్ గుర్తేడు, పాతకోట గ్రామాల్లో మోటార్ బైక్‌పై తిరిగినట్లు పోలీసుల వద్ద సమాచారముంది. పండయ్య ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఎందుకొచ్చాడు, మావోల వ్యూహం ఏమిటనేది తెలుసుకునేందుకు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 40 మంది వరకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏవోబీ దళ డిప్యూటీ కమాండర్ రవి ఆధ్వర్యంలో ఒడిశా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కీలకమైన రోడ్డు పనులు పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో నిలిచిపోయిన పాతకోట–మంగంపాడు రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే పాతకోట– ధారకొండ రోడ్డు, వై.రామవరం– ఉప్పర గోతుల, మఠం భీమవరం రోడ్డు పనులను పూర్తి చేసి లోతట్టు ప్రాంతంలో గ్రామాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో సెల్ టవర్లు నిర్మించి సమాచార వ్యవస్థ బలోపేతం చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి గిరిజన యువత మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సర్వత్రా చర్చ
అడవిని జల్లెడ పడుతున్న బలగాలు
మావోయిస్టు కీలక నేత సంచారంపై అప్రమత్తమైన పోలీసులు


