● 250 రకాలతో అలరారుతున్న మైరెన్ మ్యూజియం ● జనం ఎరుగని సముద్ర జాతులకు ఆలవాలం ● వాటిని పదిల పరిచే బాధ్యతను తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఐ ● భావితరాలు, విద్యార్థులు,పరిశోధకులకు ఉపయుక్తం
సముద్రపు గుర్రం (సీ హార్స్)
సీ హార్స్. దీనినే సముద్రపు గుర్రంగా పిలుస్తారు. చూడటానికి గుర్రపు ఆకారంలో ఉంటూ సముద్రంలోనే జీవిస్తుంది. రొయ్య సైజులో ఉంటుంది. వీటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. ఇవి తూర్పు తీరంలోను, అండమాన్ సముద్రంలోనూ ఉంటాయి. వీటికంటే అస్ట్రేలియా సముద్ర జలాల్లో పెరిగేవి ఇంకా తెలుపు రంగులో ఉంటాయి. వీటిని అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా గుర్తించారు.
సాక్షి, విశాఖపట్నం: ఆవులను చూశాం. గుర్రాలనూ చూశాం.. పాములనూ చూస్తున్నాం. కానీ సముద్రపు ఆవు.. సముద్రపు గుర్రం, సముద్ర పాములను ఎప్పుడైనా చూశారా? అయితే వాటి కోసం మీరు సముద్రంలోకి వెళ్లక్కర్లేదు. మన విశాఖ బీచ్ రోడ్డులో ఇలాంటి వాటిని చూడొచ్చు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) భవనంలో ఆధునీకరించిన మైరెన్ మ్యూజియంలో వీటితోపాటు జనం కంటపడని అత్యంత అరుదైన 250 మత్స్యజాతులు దర్శనమిస్తున్నాయి. అక్కడ గతంలో ఏర్పాటు చేసిన మైరెన్ మ్యూజియంను ఇటీవల ఆధునీకరించారు. ఈ మ్యూజియంను భావి తరాలు, విద్యార్థులు, పరిశోధకులతో పాటు సాధారణ ప్రజలు సందర్శించడానికి అనుమతించనున్నారు. ఎఫ్‌ఎస్‌ఐ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో భాగంగా తమ నౌకల్లో సముద్రంలోకి వెళ్లినప్పుడు అరుదైన మత్స్య జాతులను తీసుకొస్తారు. వాటిలో ముఖ్యమైన వాటిని ఫార్మాలిన్, నీరు (1ః4 నిష్పత్తి) కలిగిన మిశ్రమంలో గాజు సీసాల్లో భద్రపరుస్తారు. మరికొన్నింటిని లోపలున్న మాంసాన్ని తొలగించి దూదిని ఉంచి, పైన రసాయనంతో కూడిన పాలిష్‌ను పూస్తారు. ఇలాంటి వాటిని ఈ మైరెన్ మ్యూజియంలో ఉంచారు. వాటిలో కొన్ని అరుదైన మత్స్యజాతుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాటి తీరుతెన్నులను పరికిస్తే వింత గొలుపుతుంది! వాటిలో కొన్ని..
సముద్రపు ఆవు (సీ కౌ)
ఇవి తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవుల సముద్ర జలాల్లోనే ఉన్నాయి. ఇవి శాకాహారులు. సముద్రపు గడ్డిని, ఆల్గేను తింటాయి. క్షీరద జాతికి చెందిన ఇవి 2–7 ఏడేళ్లకోసారి సంతానోత్పత్తి చేస్తాయి. 2.5 మీటర్ల పొడవు, 230 నుంచి 400 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం 70 ఏళ్లు. ఇలాంటి భారత సముద్ర జలాల్లో 200 వరకు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం విశాఖ మైరెన్ మ్యూజియంలో ఉన్న ఈ సీ కౌ తమిళనాడులోని ట్యుటికోరిన్ మ్యూజియంలో ఉండేది. ఆ మ్యూజియాన్ని మూసివేయడంతో దానిని 1985లో అక్కడ నుంచి ఇక్కడకు తెచ్చారు.


