మెడికల్ షాపుల్లో నకిలీ ఫార్మసిస్టులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని దాదాపు అన్ని మెడికల్ షాపులు ఫార్మసిస్టులు లేకుండానే కొనసాగుతున్నాయి. సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని కొందరు ఈ దందా సాగిస్తున్నారు. అనర్హులను నియమించుకుని రూ.లక్షల్లో వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో స్టాండర్డ్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, మెడికల్ షాపుల దందా తేటతెల్లమైంది. జిల్లాలోనూ ఇదే తీరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో ఇలా..
మందుల షాపు అంటే రోగి నమ్మకం.. జబ్బు చేస్తే డాక్టర్ వద్దకు వెళ్లి ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్‌కు వెళితే ఫార్మసిస్టు గమనించి మందులు అందజేయాలి. డోస్ గురించి తెలియజేయాలి. కానీ ఎక్కడా ఇలా జరగడం లేదు. జిల్లాలో 400 వరకు మెడికల్ షాపులు ఉండగా ఒక్క ఆదిలాబాద్‌లోనే 150 వరకు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల అర్హులైన ఫార్మసిస్టులు లేని పరిస్థితి. అర్హత కలిగిన వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని డ్రగ్ లైసెన్సులు పొందడం, తర్వాత విద్యార్హతలు లేని వారితో మందులు విక్రయించడం వంటివి చేపడుతున్నారు. ఫార్మసిస్టు సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు చెల్లిస్తూ నిర్వాహకులు తమ వ్యాపారం సాగిస్తున్నారు. సంబంధిత అధికారుల తనిఖీల సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
అద్దె సర్టిఫికెట్లతో లైసెన్సులు..
ఫార్మసీ విద్య పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తే నెలవారీగా డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా షాపులకు లైసెన్సులు పొందుతున్నారు. తనిఖీల సమయంలో ఫార్మసిస్ట్ వివరాలు చూపిస్తూ నిబంధనలు పాటిస్తున్నట్లు వెల్లడిస్తున్నా, వాస్తవంగా మందుల విక్రయాలు చేపట్టేది అర్హతలేని సిబ్బందే అనే విమర్శలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగానే తనిఖీలు చేసి వెనుదిరుగుతున్నారనే అపవాదు లేకపోలేదు. ఫార్మసీ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనల ప్రకారం మందుల విక్రయాలకు సంబంధించి నిర్దేశించిన అర్హతలు, రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలి. ప్రిస్క్రిప్షన్ మందుల పంపిణీకి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సేవలు తప్పనిసరి. అయితే అధికారుల నామమాత్ర తనిఖీల కారణంగానే ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజారోగ్యంతో చెలగాటం..
మెడికల్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి అర్హత, అవగాహన ఉండదు. బట్టి పట్టి మందులు పేర్లు గుర్తుంచుకుంటున్నారు. డాక్టర్ రాసే రాత కూడా కనిపెట్టలేని వారు అనేకం. వినియోగదారులు పేరు చెప్పే మందులను ఇస్తున్నారు. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించవద్దనే నిబంధనలు న్నాయి. అలాగే ప్రతి కొనుగోలుదారుడికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది.
సర్టిఫికెట్ ఉన్నవారే
నిర్వహించాలి..
ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఉన్నవారే మెడికల్ షాపుల నిర్వహణ చేపట్టాలి. తనిఖీలు విస్తృతంగా చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై షాపుల యజమానులకు అవగాహన కల్పిస్తాం. ఇతరుల పేరిట సర్టిఫికెట్లు తీసుకొని నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు.
– శ్రీలత, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్


