కై లాస్‌నగర్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం అమలు విధివిధానాలు, అర్హుల గుర్తింపు, దరఖాస్తుల నమోదు, ప్రత్యేక శిబిరాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 వరకు విడతలవారీగా శిబిరాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అలాగే ఈ నెల 16న గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, ఏపీఎంలతో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ తహసీల్దార్లు, మెప్మా అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఆయా శిబిరాల్లో ప్రతీ దరఖాస్తుపై క్యాంపు ఇన్‌చార్జి అధికారి, బీమా పొందే వ్యక్తి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని 1,276 ఆవాసాల్లో ఉన్న 197 పీవీటీజీ ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, సీపీవో వెంకటరమణ, డీపీవో రమేశ్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, మెప్మా, సెర్ప్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


