కై లాస్‌నగర్: ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమలుపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. సర్కారు నిర్ణయంతో జిల్లాలోని 2లక్షల 84వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
రూ.5లక్షల బీమా
పేద, మధ్యతరగతి వర్గాల్లో ఇంటి పెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అండగా నిలువాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు నిర్ణయించింది. ఈ పథకం కింద సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందజేయనుంది. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా భరోసానివ్వనుంది. పథకం అమలుపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇలా..
ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మా ర్గదర్శకాలను జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 ఏళ్లలోపు కలిగి ఉండాలి. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్ణయించనున్నారు. జనాభా గణనలో గు ర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలు చేయనున్నారు. పథకం తీరుతెన్నులను ప్రజల కు తెలియజేసేలా 17,18 తేదీల్లో జిల్లాలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో టాంటాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈనెల 20 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందు కోసం గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయనున్నారు. ఇందుకోసం నిర్దిష్ట ప్రొఫార్మా సిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు చేరవేసింది. వీటి ద్వారానే ప్రజలు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అమలు ఇలా..
బీమా క్లైయిమ్‌లకు సంబంధించి గ్రామస్థాయిలో అయితే పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సీపీవో/డీఆర్డీవో, కలెక్టర్/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆమోదం ద్వారా బీమా కంపెనీకి ఫార్వర్డ్ చేయబడుతుంది. మున్సి పల్ స్థాయిలో వార్డు ఆఫీసర్ దరఖాస్తులను స్వీకరించనుండగా కమిషనర్ పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌తో పాటు సీపీవో/మెప్మా పీడీ పరిశీలించి కలెక్టర్/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత క్లెయిమ్ ఫాం బీమా కంపెనీకి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువగా సంపాదించేవారు ఉంటే ఎవరి పేరిట బీమా పొందాలనుకుంటున్నారో, వారి నామినీలను నిర్ణయించుకునే వెసులుబాటు దరఖాస్తుదారులకు కల్పించనున్నారు.


