అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

అదనపు ఆదాయం

Oct 2 2026 3:15 AM | Updated on Oct 2 2026 3:15 AM

● జిల్లాకు మహారాష్ట్ర రైతుల పత్తి ● అనుమతించిన ఇరు ప్రభుత్వాలు ● యాప్‌లో నమోదు చేసుకుంటేనే..

సాక్షి, ఆదిలాబాద్‌: మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహో ర్‌ తాలుకాల్లోని రైతులకు ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి విక్రయించేందుకు అనుమతి లభించింది. ఈ సీజన్‌లోనే అక్కడి రైతులు ఇక్కడి మార్కెట్‌కు రానున్నా రు. ఈ నిర్ణయంపై పారిశ్రామికంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి జీఎస్టీ లభించడంతోపాటు మార్కెటింగ్‌ శాఖకు ఒక శాతం సెస్‌ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఇక జిన్నింగ్‌లలో అదనంగా పత్తి రాకతో బేళ్ల తయారీ, రవాణా తదితర అంశాల విషయంలో ఇక్కడ అనేక మందికి ఉపాధి కూడా లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనుమతి ఎలా లభించిందంటే..

కిన్వట్‌, మాహోర్‌ తాలుకాల్లోని 176 గ్రామాల రైతులు ఆదిలాబాద్‌ జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చాయి. అక్కడి ప్రధాన మార్కెట్‌ కేంద్రాల కంటే ఆయా గ్రామాలు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికే దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి రైతుల డిమాండ్‌ను నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొన్ని దశాబ్దాలుగా సరిహద్దు గ్రామాల్లోని రైతులు పత్తిని ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకే తెచ్చి విక్రయించే సంప్రదాయం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర పొందేందుకు సరిహద్దు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఆదిలాబాద్‌ సీసీఐ సెంటర్‌లో నేరుగా విక్రయించే అవకాశం కల్పించారు.

వారికీ నమోదు తప్పనిసరి

మహారాష్ట్ర రైతులు ఇక్కడ పత్తి విక్రయించాలంటే ముందుగా కపాస్‌ కిసాన్‌ యాప్‌లో నమోదు చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. వ్యవసాయ అధికారులు వివరాలు నమోదు చేసుకోవాలి. అక్కడి వ్యవసాయాధికారులు, ఆయా పంటల సాగు వివరాలు, విస్తీర్ణాన్ని యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కలెక్టర్‌ కొనుగోలు సన్నాహక సమావేశాల్లో అధికారులకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. దీంతో అక్కడి, ఇక్కడి వ్యవసాయ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

అదనంగా 6లక్షల క్వింటాళ్లు

గతేడాది ఆదిలాబాద్‌ మార్కెట్‌లో సుమారు 8లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఒక శాతం సెస్‌ రూపంలో రూ.8 కోట్లకు పైగా మార్కెటింగ్‌ శాఖకు ఆదాయం లభించింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంత రైతుల నుంచి సుమారు 6లక్షల క్వింటాళ్ల పత్తి అదనంగా వస్తుందని అంచనా. తద్వారా సెస్‌ రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది. ఇక్కడి జిన్నింగ్‌లకు పత్తి దిగుబడుల రాక పెరగనుండడంతో వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అదనంగా బేళ్ల తయారీతో పాటు వాటి రవాణా విషయంలో లబ్ధి చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement