ఆదిలాబాద్‌టౌన్: బిహార్‌కు చెందిన సైబర్ మోసగాళ్లను గుర్తించి అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కార్యాలయం నుంచి అందిన ప్రశంసా పత్రాలను గురువారం జైనథ్ సీఐ జి.శ్రావణ్, భీంపూర్ ఎస్సై పీర్‌సింగ్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపికృష్ణ, కానిస్టేబుళ్లు ఎ.రాజేశ్, బి.పురుషోత్తం, సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్, మాజిద్, త్రిశూల్, అన్వేష్‌కు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశశవ్యాప్తంగా 498 క్రైమ్ లింక్‌లకు సంబంధించి రూ.3 కోట్ల 50 లక్షల 58 వేల 834 మేరకు జరిగిన సైబర్ మోసాల కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో సిబ్బంది కీలకంగా పనిచేశారన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.


