వేమనపల్లి: ఆస్తి కోసం తమ్ముడిని అన్న హత్య చేసినట్లు చెన్నూర్ రూర ల్ సీఐ కృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని నీల్వాయికి చెందిన కుడుకల శ్రీనివాస్(40)ను అతని అన్న రాజేష్ ఆస్తికోసం హత్యకు పథక రచన చేశాడు. ఈనెల 20న శ్రీనివాస్‌ను చెన్నూరుకు రప్పించాడు. రాజేష్ చెన్నూరు మండలం చాకపల్లికి చెందిన సమీప బంధువు గోదారి సమ్మయ్య మరో కొందరికి సుపారీ ఇచ్చాడు. చెన్నూరులో మద్యం తాగించి సోమనపల్లి, శివారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆరోజు భారీ వర్షం కురవడంతో మృతదేహం 80 శాతం కాలి ఎముకల గూడు మిగిలింది. మద్యం షాపు వద్ద సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. హత్య జరిగిన రోజు నిందితుల వద్ద కాల్‌డేటా, రికార్డింగ్ పక్కా ఆధారాలు సేకరించారు. అన్న పరారీలో ఉండగా గాలిస్తున్నారు. ఆరుగురిని అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, వారం క్రితం అదృశ్యమైన శ్రీనివాస్ విగతజీవిగా మారడంతో కుటుంబీకులు విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


