రిమ్స్‌ అభివృద్ధిపై కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ అభివృద్ధిపై కలెక్టర్‌ సమీక్ష

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

కై లాస్‌నగర్‌: రిమ్స్‌లో అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యవసర మరమ్మతులైన తలుపులు, కిటికీలు, టాయిలెట్లు, ఆక్సిజన్‌ పైపులైన్లు, జనరేటర్లు, లిఫ్ట్‌, రోడ్లు, ప్రహరీ నిర్మాణ పనులన్నీ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11.10 కోట్ల అత్యవసర నిధులతో విద్యుద్దీకరణ, రోడ్లు, భవన సముదాయాలు, మౌలిక వసతులు, శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, సత్వరమే టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ఔట్‌పేషెంట్‌, ప్రెగ్నెంట్‌ బ్లాక్‌ మధ్య రోగుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీపీవో రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ శివరాం పాల్గొన్నారు.

బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం

రిమ్స్‌ ఘటనలో గాయపడ్డ చిన్నారులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అలాగే మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన 12 మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లుగా తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. డిశ్చార్జ్‌ అయిన చిన్నారుల్లో ఏడుగురు మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. వారి వివరాలను నాందేడ్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు అందించి వారితో సమన్వయం చేస్తున్నట్లుగా తెలిపారు. మిగిలిన ఐదుగురు జిల్లాకు చెందినవారని, వారికి స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వైద్య సలహాలు, సేవలు అందిస్తున్నామని వివరించారు. మరో ఎనిమిది మంది హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరో ఇద్దరు రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. రిమ్స్‌లో నవజాత శిశువులకు అందించే వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా 34 పడకల సామర్థ్యంతో ఎంఎన్‌ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement