ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలి ఐదుగురు శిశువులు మృతిచెందిన ఘటనపై గురువారం విచారణ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు, సభ్యులుగా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుభాష్, జిల్లా ఫైర్ అధికారి భగవాన్‌రెడ్డి, ఏజెన్సీ అడిషనల్ డీఎంహెచ్‌వో మనోహర్, టీజీఎంఐడీసీ ఈఈ రామ్‌కుమార్, డీఈ ఎంఆర్‌టీ తదితరులు గురువారం రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని సందర్శించారు. సీజ్ చేసిన విభాగాన్ని తెరిచి విచారణ జరిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరి శీలించారు. సిబ్బందిని పిలిచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. వీరు కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. కాగా, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు జరిగిన ఘటనపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. ఇందులో నిర్మల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్, మంచిర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్, నిజామాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఉండనున్నట్లు తెలిసింది.


