ఉట్నూర్ పీఏసీ గొడవ అంశంపై అధిష్టానం సీరియస్
‘కంది’కి మరోసారి షోకాజ్.. తాజాగా సంజీవ్‌రెడ్డికి కూడా
కాంగ్రెస్‌లో సద్దుమణగని గొడవ
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉట్నూర్ పీఏసీ సమావేశంలో జరిగిన గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవ్‌రెడ్డి మధ్య అప్పట్లో జరిగిన వివాదంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అప్పుడు కేవలం ‘కంది’కి మాత్రమే క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి షోకాజు నోటీసు జారీ అయ్యింది. దీనికి ఆయన స్పందిస్తూ సమాధానం కూడా ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై తీవ్ర చర్చ సాగడం, రాష్ట్ర రాజకీయాలన్నీ అటువైపే దృష్టి సారించడంతో ఈ గొడవను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఈ అంశంలో మళ్లీ కందితో పాటు సంజీవ్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతనెల 17న ఉట్నూర్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. పీఏసీ సభ్యులు కాని వారిని సమావేశానికి ఎవరు పిలిచారని సంజీవ్‌రెడ్డిని ఉద్దేశించి కంది ఆ సమావేశంలో ప్రశ్నించారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి మంత్రి జూపల్లి ఆదేశాలతో సంజీవ్‌రెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం జరిగింది.
తాజాగా సంజీవ్‌రెడ్డికి కూడా..
ఈ గొడవకు సంబంధించి అప్పుడు కందితో పాటు ఆయన అనుచరులకు మాత్రమే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం, ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగింపు చర్యలు సంచలనం కలిగించాయి. ఇక ఆదిలాబాద్ అంశంలో నామమాత్రంగా వ్యవహారం ఉంటుందా అని అనుకునే లోపే తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల్లో ఇద్దరూ సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
గ్రూపు తగాదాలు..
ఉట్నూర్ పీఏసీ సమావేశం తర్వాత బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఏకంగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌పైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం గ్రూపు తగాదా లను స్పష్టం చేసింది. ఏకంగా 40 వాహనాల్లో అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి డీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అయోమయం వ్యక్తమైంది. తాజాగా పార్టీ మళ్లీ ఈ అంశంలో నోటీసు జారీ చేయడంతో ఆయా నేతల అనుచరులు మళ్లీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండడం గమనార్హం.


