అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
జిల్లా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ యోగితా రాణా
కై లాస్‌నగర్: సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియ పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల ని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. ప్రస్తుత ప్రత్యేక సవరణ గతంలో నిర్వహించిన సవరణలకు భిన్నంగా అత్యంత సమగ్రంగా కొనసాగుతోందన్నారు. 2002, 1984 నాటి రికార్డులు, సంబంధిత పత్రాలను ఆధారంగా చేసుకుని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్యను పరిశీలించాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీ ఎల్‌వోల పాత్ర కీలకమని, అధికారులు–బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.
60వేల నోటీసుల పరిష్కారం
కై లాస్‌నగర్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో లక్ష 50వేల మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో 60వేల వరకు పరిష్కరించామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కు వ పెండింగ్‌లు ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేస్తున్నట్లుగా తెలిపారు. డాక్యుమెంట్ అప్‌లోడింగ్, హియరింగ్ లాప్స్, దరఖాస్తుల సేకరణను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల వద్ద కేవలం 99 మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లుగా వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


