ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ
ఓ వైపు సర్వే.. మరోవైపు నోటిఫికేషన్
9 నుంచి గ్రామ సభల నిర్వహణ
నిషాన్‌ఘాట్‌లో 428.16 ఎకరాలకు నోటిఫికేషన్
అనుకుంట భూములకు నేడో, రేపో ప్రకటన
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఓ వైపు భూసేకరణ సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు సేకరించనున్న భూములకు అధికారులు ప్రాథమిక నోటిఫికేన్లను జారీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు గ్రామాలకు సంబంధించి జారీ కాగా నిషాన్‌ఘాట్‌లోని భూములకు సంబంధించి ఆదివారం విడుదల చేశారు. అత్యధికంగా సేకరించనున్న అనుకుంట భూములకు నేడో, రేపో జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సర్వే పూర్తై, నోటిఫికేషన్ కాల పరిమితికి చేరువైన గ్రామాల్లోని భూములపై ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను సైతం ఖరారు చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేంతవరకు ఇదే స్పీడ్ కొనసాగితే త్వరలోనే ఎయిర్‌పోర్టు భూమిపూజ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ప్రక్రియ వేగవంతం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఎయిర్‌పోర్టుకు అసవరమైన భూమి గుర్తించేందుకు రెవెన్యూ, సర్వేయర్లతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ బృందాలు సర్వే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి. తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. కాగా ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోకి వచ్చే కచ్‌కంటి గ్రామంలో 29.19 ఎకరాలు, టాక్లిలో 5.20 ఎకరాలు, అర్లి–బి మండల పరిధిలో 160.30 ఎకరాల భూమిని సేకరించేందుకోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే అత్యధికంగా పట్టణా నికి అనుకుని ఉన్న అనుకుంటలో 800 ఎకరాల భూమిని సేకరించేందుకు సోమ, మంగళవారాల్లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి అధికారులు నిర్ణయించారు. ఇక పట్టణ పరిధిలోని నిషాన్‌ఘాట్‌లో 428.16 ఎకరాల భూమికి అధికారులు ఆదివా రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులోని రైతుల భూవిస్తీర్ణం, ఖాతాదారు పేరు వంటి వివరాల్లో ఏ మైనా తేడాలుంటే భూసేకరణ అధికారి, కలెక్టర్ కార్యాలయంలో అభ్యంతరాలు అందజేయాలని క లెక్టర్ రాజర్షి షా సూచించారు. కాగా నిర్వాసితులకు నోటీసులు అందిన తర్వాత వారం రోజుల్లో ఇక్కడ కూడా గ్రామ సభ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రక్రియను చేపడుతున్నట్లగా కలెక్టర్ వివరించారు.
9,11 తేదీల్లో గ్రామసభలు
భూసేకరణకు గాను ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో నిర్వాసిత రైతుల అభ్యంతరాలు, విజ్ఞప్తులను తెలుసుకునేందుకు గాను తొలుత ఈనెల 9న అర్లి–బి, 11న కచ్‌కంటిలో గ్రామసభలు నిర్వస్తున్నాం. నిర్వాసితులు తెలిపే అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. సర్వే పూర్తయిన కొద్ది నోటిఫికేన్లను జారీ చేసి అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తాం. ఏ గ్రామంలో ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకనుగుణంగా ఉన్నతాఽధికారులు నిర్ణయిస్తారు.
– పి.జగదీశ్వర్‌రావు, ఆర్డీవో
రక్షణాశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎరోడ్రమ్‌లోని 369.49 ఎకరాలకు అనుబంధంగా మరో 2009.23 ఎకరాలతో కలిపి రక్షణ, పౌర విమానాయాన శాఖల ఆధ్వర్యంలో జాయింట్ యూజర్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాలకనుగుణంగా పౌర విమానయాన శాఖకు 400, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు 1609.23 ఎకరాల చొప్పున సేకరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈమేరకు రూ.1500 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో కలిసి కార్గో, ప్యాసింజర్, టెర్మినల్ వసతుల ఏర్పాటుకు సహకరించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిర్వాసితులకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందనట్లుగా అధికారులు చెబుతున్నారు.


