సొంత బడిలో పేపర్లు దిద్దొద్దు | - | Sakshi
Sakshi News home page

సొంత బడిలో పేపర్లు దిద్దొద్దు

Sep 7 2026 2:44 AM | Updated on Sep 7 2026 2:44 AM

సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌లో కొత్త విధానం

విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకునేందుకు..

మార్కుల నమోదుపై ప్రత్యేక నిఘా

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో కీలకమార్పు చోటు చేసుకోనుంది. ఇకపై జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కాకుండా ఇతర స్కూళ్ల టీచర్లతో క్రాస్‌ వాల్యుయేషన్‌ చేయించనున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఖచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడమే లక్ష్యంగా ఈ విధానం అమలు చేయనున్నారు.

పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షల జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. ఈ క్రాస్‌ వా ల్యుయేషన్‌ విధానం ద్వారా పక్షపాతం లేకుండా మరింత పారదర్శకత తీసుకురావచ్చని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన చోట అదనపు బోధన, రెమేడియల్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడనుంది.

మండల కేంద్రాల్లోనే..

ప్రతి మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎంఈవో పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత నిష్పక్షపాతంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు..

మూల్యాంకనం పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను తరగతి, సబ్జెక్టుల వారీగా నమోదు చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని సరిచేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మండలాల వారీగా మూల్యాంకన ప్రక్రియను డీఈవో పరిశీలించనున్నారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో సర్కారు బడుల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదనే కారణంతోనే ఈ విధానం చేపట్టినట్లు తెలుస్తోంది.

డీఈవో పరిధిలో

మొత్తం పాఠశాలలు 678

ప్రాథమిక 467

ప్రాథమికోన్నత 105

ఉన్నత 106

విద్యార్థులు 58వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement