అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● అటవీ శాఖాధికారులతో సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: పోలీసు, అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో పోలీసు, అటవీశాఖల సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో స్మగ్లింగ్‌, అక్రమ పోడు వ్యవసాయం, వన్యప్రాణులను వేటాడటం, పంట పొలాల చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వాటిపై ప్రజలు పోలీసు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుశాంత్‌ సుఖ్‌దేవ్‌ బొబాడే, ఆదిలాబాద్‌ ఎఫ్‌డీవో చిన్నవిశ్వనాథ్‌ బూసరడ్డి, ఇచ్చోడ ఎఫ్‌డీవో ప్రత్మేష్‌ కేశవ్‌ తిజారే, ఉట్నూర్‌ ఎఫ్‌డీఓ అరవింద్‌, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ ఎఫ్‌ఆర్‌వో అవినాష్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంస

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. రాయితీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు రిమ్స్‌లో సెల్‌ఫోన్‌ దొంగలను పట్టుకుని ప్రతిభ కనబర్చిన 11 మంది పోలీసు సిబ్బందిని అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా వారిని సన్మానించి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రైల్వే స్టేషన్‌లో ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని పట్టుకున్న బి.గజానంద్‌, ఎం.సాయి, జి.సుధాకర్‌, అరవింద్‌, శ్రీనివాస్‌తో పాటు బస్టాండ్‌లో రాయితీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ఏఆర్‌ ఎస్సై దినకర్‌, నగేష్‌, సాయిప్రసాద్‌, కృష్ణవేణిని అభినందించారు. రిమ్స్‌లో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్న రుక్మారెడ్డి, శ్రీకాంత్‌, ముజమిల్లాలను ప్రశంసించారు.

నేరాల నియంత్రణలో

సీసీ కెమెరాలు కీలకం

ఆదిలాబాద్‌(బేల): గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాల నిఘా ఎంతో కీలకమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మండలంలోని చప్రాల, సిర్సన్న, ఎకోరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను శుక్రవారం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా మరింత అవసరమని పేర్కొన్నారు. చప్రాలలో 15, సిర్సన్నలో 16, ఎకోరిలో 4 కెమెరాలను ఏర్పాటు చేశారు. సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామస్తులను అభినందించారు. అనంతరం చప్రాల రైతు వేదికలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. 15 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. చప్రాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 20 మందికి కంటి అద్దాలు అందించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి, జైనథ్‌ సీఐ శ్రావణ్‌ కుమార్‌, ఎస్సైలు మధుకృష్ణ, పి.గౌతమ్‌, సర్పంచ్‌, పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement