విద్యారంగానికి వరం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి వరం

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

‘యంగ్‌ ఇండియా’ వచ్చేస్తుంది.. జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఒకే ప్రాంగణంలో విద్య, వసతి, క్రీడలు నిధుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మారుమూల ప్రాంతాలు.. గిరిజన గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో వీటిని మంజూరు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు పథకాలతో పాటు కొత్తగా మరో ఏడు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు సైతం నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో బోథ్‌లో అడిగామ(కె), ఆదిలాబాద్‌ నియోజకకవర్గంలోని జైనథ్‌ మండలం బెల్గాం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఖానాపూర్‌ నియోజకవర్గం ఉట్నూర్‌ మండలంలోని కుమ్మరితండాలోనూ మంజూరుకాగా తాజాగా నిధుల విడుదలతో పనులు వేగవంతం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఒకే ప్రాంగణంలో..

యంగ్‌ ఇండియా స్కూల్‌ సాధారణ పాఠశాలల మాదిరిగా కాకుండా ఇంటర్నేషనల్‌ స్కూళ్ల తరహాలో ఉండనున్నాయి. ఒక్కోస్కూల్‌కు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఒకే ప్రాంగణంలో చదువుతో పాటు వసతి, క్రీడలు, డిజిటల్‌ సౌకర్యాలు, ప్రయోగశాలలు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ పాఠశాలల ఏర్పాటుతో విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గిరిజనులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్య, సౌకర్యాలు లేక పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారు. పట్టణాలకు వెళ్లి చదువుకోలేని కుటుంబాలకు ఇది వరంగా మారనుంది.

పేద విద్యార్థులకు మేలు

జిల్లాలో మూడు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇదివరకే టెండర్లు పూర్తి కాగా, కుమ్మరితండాలో పనులు కొనసాగుతున్నాయి. బెల్గాం, అడిగామ(కె)లో ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ స్కూళ్లు పేద విద్యార్థులకు వరం లాంటిది. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది.

– మాధవి, డీఈవో

విద్యార్థుల భవిష్యత్తుకు బాట..

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు పడనున్నాయి. సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, క్రీడా ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునే వాతావరణం కల్పించనున్నారు. దీంతో సమానత్వ భావన పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకేచోట కేజీ నుంచి పీజీ వరకు విద్యాబోధన చేయనుండడంతో స్థానిక విద్యార్థులు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement