కై లాస్‌నగర్: రేషన్ ఈకేవైసీ నమోదు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గత నెల 31తో ముగియగా తాజాగా ఈనెల 31వరకు పొడిగిస్తూ మరో అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటి వరకు వివరాలు నమోదు చేసుకోని కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 77.33 శాతం మంది మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారు. మిగిలిన వారంతా రేషన్‌షాపులను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మూడు నెలల బియ్యం కోటా ఈ నెలలోనే అందించాలని నిర్ణయించింది.
సమస్యగా ఆధార్ అప్‌డేషన్
ఆధార్ అప్‌డేషన్ లేకపోవడం ఈకేవైసీ నమోదుకు అవరోధంగా మారుతోంది. పదేళ్ల క్రితం పొందిన కార్డులను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అప్‌డేట్ చేసు కోవాల్సి ఉంది. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారుల పేర్లను గతంలో వారి తల్లిదండ్రుల ఈకేవైసీ ఆధారంగా రేషన్‌కార్డుల్లో నమోదు చేశారు. ప్రస్తుతం వారి వయస్సు ఐదేళ్లు దాటినందున తప్పనిసరిగా వారి కార్డులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. చిన్నారుల ఫొటో, కనుబొమ్మలు, ఫింగర్ ఫ్రింట్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది కార్డుదారులు పట్టించుకోలేదు. ఈకేవైసీ లేనిదే బియ్యం ఇవ్వడం కుదరదనే ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి వారంతా ప్రస్తుతం ఆధార్‌కు పరుగు తీస్తున్నారు. జూలై 31 చివరి గడువుగా పేర్కొనడంతో ఆందోళనకు గురయ్యారు. తామెక్కడ సరుకులకు దూరమవుతామోనని హైరానా పడ్డారు. ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించడంతో వారికి ఊరట కలిగింది.
రేషన్ షాపుల్లో ఈకేవైసీ..
ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోని కార్డుదారులు సమీపంలోని రేషన్‌షాపులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల ఽశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం తమ రేషన్‌కార్డుతో పాటు కార్డులోని సభ్యులందరి ఆధార్‌కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డీలర్ల వద్ద ఉన్న పీవోఎస్‌పై ఫింగర్‌ఫ్రింట్ వేయడం ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
అందరూ నమోదు చేసుకోవాలి
రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ నమోదు గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. వివరాలు నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డీలర్లు, ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు కార్డుదారులకు అవగాహన కల్పించి వంద శాతం ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి.
– నందిని, డీఎస్‌వో


