కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు | - | Sakshi
Sakshi News home page

కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు

Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM

పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యం

గణితం, సైన్స్‌ కిట్లకు నిధులు

ఉమ్మడి జిల్లాలో 78 పాఠశాలలకు రూ.7.80 లక్షలు

లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్‌ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్‌ అభియాన్‌ పథకం కింద గణితం, సైన్స్‌ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్‌ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది.

పరికరాల కొనుగోలుకు కమిటీ

ప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్‌ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులు, ఒక సీనియర్‌ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్‌కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు.

విద్యార్థులకు ప్రయోజనం

గణిత, సైన్స్‌ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్‌ క్లబ్‌లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు.

ప్రత్యక్ష బోధన

సైన్స్‌, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్‌ ప్యానెల్‌ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్‌ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ

పాఠశాలలు, మంజూరైన నిధులు

జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు

మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు

ఆదిలాబాద్‌ 21 రూ.2.10 లక్షలు

నిర్మల్‌ 19 రూ.1.90 లక్షలు

కుమురంభీం 16 రూ.1.60 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement