సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా నాంచారెడ్డిపాలెం, పేర్నమిట్ట గ్రామాలకు బుధవారం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పి.గోపి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఎండ్లూరు సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల వల్ల ఎండ్లూరు, మైనంపాడు, చలప్పపాలెం, లక్ష్మీపురం, ఎండ్లూరు ఇండస్ట్రియల్, ట్రిబుల్ ఐటీ కళాశాలలో కూడా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తారని ఆయన పేర్కొన్నారు.
చీమకుర్తి: బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పాపకు శివం ఫౌండేషన్ సంస్థ తరఫున రూ.50 వేలను సీఐ దాసరి ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. చీమకుర్తిలోని విద్యానగర్‌కు చెందిన జంజనం గోపీకృష్ణ, సుజాత దంపతులకు చెందిన 7 సంవత్సరాల హర్షిణి గత రెండేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు. దాతల సహకారంతో రూ.50 వేలను సమకూర్చి పాపకు అందించారు. సీఐ దాసరి ప్రసాద్ కూడా స్పందించి తన వంతు సహాయాన్ని అందిస్తానని పాప తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
ఒంగోలు సిటీ: ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌బాబు, ఆర్.క్రిష్ణారెడ్డిలను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. కలిసిన వారిలో అధ్యక్షుడు సాయికిషోర్, ప్రధాన కార్యదర్శి చిలకా కిషోర్, ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరెడ్డి, కోశాధికారి సురేష్‌రెడ్డి, పి.అనిల్ పురుషోత్తం, ఎస్.కోటిరెడ్డి పాల్గొన్నారు.
మద్దిపాడు: మద్దిపాడు ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఉదయం డీపీఓ అనుపమ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పీజీఆర్‌ఎస్ అర్జీలు పెండింగులో ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న పీజీఆర్‌ఎస్ అర్జీలను వెంటనే విచారించి నివేదిక సమర్పించాలని ఇన్చార్జ్ ఎంపీడీవో కిషోర్ను ఆదేశించారు. అనంతరం మండలానికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో హరిప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాగులుప్పలపాడు: మండలానికి చెందిన డా.రమేష్ బాబు జిల్లా మలేరియా అధికారి అవడం చాలా సంతోషకరమని ఫార్మా సిబ్బంది సౌరయ్య అన్నారు. నాగులుప్పలపాడు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన డా.రమేష్ జిల్లా మలేరియా అధికారి గా నియమితులు కావడంతో మంగళవారం హనుమాపురం గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య సిబ్బంది డా.రమేష్‌ను సన్మానించారు. కార్యక్రమంలో యోహోషువా, కనపర్తి రమేష్, శ్రీనివాసరావు, జయరావు, సిబ్బంది ఉన్నారు.
ఒంగోలు మెట్రో: ఆషాఢ మాసం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులో శివప్రసాద్ కాలనీలో మంగళవారం గ్రామదేవత పోలేరమ్మకు అభిషేకం, అర్చన నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు సామూహికంగా పాల్గొని తమ ఇంటి ఇలవేల్పు అయినా పోలేరమ్మకు పసుపు కుంకుమ గాజులు సారే సమర్పించుకొని వేడుకున్నారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఒంగోలు సిటీ: ఉద్యోగుల స్థానిక కేడర్ అభ్యంతరాలు ఈ నెల 28వ తేదీలోపు సమర్పించాలని డీఈఓ సి.వి.రేణుక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధృవపత్రాలను డీడీఓ ల ద్వారా మాత్రమే ఈనెల 28వ తేదీ లోపల సమర్పించాలన్నారు.


