సంతనూతలపాడు: డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక సమ్మెతో రెండో రోజు రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించాయి. సంతనూతలపాడు పరిధిలో సమ్మె ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. రైటర్లు అందుబాటులోకి రాకపోవడంతో అనుకున్న మేర రిజిస్ట్రేషన్లు జరగక ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ల తయారీ కోసం రైటర్ల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జీఓ నంబర్ 396ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా మిగతా 26 జిల్లా కేంద్రాల్లో తొలి విడతగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తరువాత మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపిపించి అందులో ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్లు చేసే పనిని అంటే డాక్యుమెంట్ రాయించడం, చలానాలు కట్టించడం, టైమ్ స్లాట్లను బుక్ చేయడం వంటి పనులను చేస్తారు. ఈ నేపథ్యంలో తాము చేసే పనులను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో చేయిస్తే ఏళ్లుగా డాక్యుమెంటర్ తయారీ విధానాన్నే నమ్ముకొని జీవనం చేస్తున్న తమ బతుకులు ఏం కావాలని రైటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వడం, నిరసన, ప్రదర్శనలు చేశారు.
డాక్యుమెంట్ల తయారీకి హెల్ప్ డెస్క్ ఏర్పాటు..
డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మెకు వెళ్లడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను తయారు చేయడానికి హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు తెలిపారు.
డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక సమ్మె
గణనీయంగా తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు


