ఒంగోలు టౌన్: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అత్యంత దుర్మార్గమని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ మండిపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఒంగోలు నగరంలోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. నీట్ సహా దేశవ్యాప్తంగా 155 సార్లు ప్రశ్నపత్రాలు లీకై 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ కనీసం పెదవి విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. ఏటా కోటి ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తీరా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టి ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీలున్నా భర్తీ చేయడం లేదన్నారు. విద్యార్థులకు మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్‌ను బలవంతంగా అరెస్టు చేయడం ఎన్‌డీఏ సర్కారు నియంతృత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ సిసింద్రి బాబు, సచిన్, రాజీవ్, మరియబాబు, బెంజిమెన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్


