సంతనూతలపాడు: సంతనూతలపాడులోని ఏపీ గురుకుల పాఠశాలలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డి.మానస ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మంగళవారం మెడికల్ క్యాంపు నిర్వహించి 391 విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలను, చేసి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. డెంటల్ డాక్టర్ జే.శ్రీధర్ పిల్లలను పరీక్షించి దంతాల పరిరక్షణ గురించి సూచనలిచ్చారు. డెంగీ మాసం సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, దోమలు పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రమాణ రూపంగా పిల్లలచే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ సీహెచ్ మాధవరావు, పీహెచ్‌ఎన్ డి.ప్రభావతి, హెచ్‌వీ కే.ప్రభావతి, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేశ్వర్లు, ఆశాలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో ఇటీవల విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఒంగోలు భాగ్యనగర్ నారాయణ క్యాంపస్ విద్యార్థిని భువనశ్రీ ని డీఈఓ రేణుక మంగళళవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఉన్నతంగా చదువుకొని వైద్య రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని భువనశ్రీకి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో 946 ర్యాంకు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగ్యనగర్ నారాయణ క్యాంపస్ ప్రిన్సిపాల్ నిరూప్, క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి,తండ్రి వెంకటేష్ లు పాల్గొనారు.
మద్దిపాడు: గుర్తుతెలియని కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో జాతీయ రహదారి 16పై గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రోత్ సెంటర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఎదురు నేషనల్ హైవేపై, దాస్ దాబా ఎదురు వైజాగ్‌కు వెళ్లే వినాయక ట్రావెల్స్ బస్సు క్లీనర్ గండి రాజు (30) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం గుద్ది వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు సిటీ: నగరంలోని మాంటిస్సోరి స్కూల్‌కు చెందిన రేవండ్ల తాప్సీ, కేరళ హైస్కూల్‌కు చెందిన వై విమల జానకి, పి.జ్యోతిర్మయి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల కరస్పాండెంట్‌లు ప్రకాష్‌బాబు, సి.బి మైఖేల్ అవార్డు పొందిన విద్యార్థులను మంగళవారం అభినందించారు.


