● ముస్లిం సంఘాల వినతి
ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు నడిబొడ్డున ఉన్న కోటావీధి ఉర్దూ స్కూలును పునర్నిర్మించాలని ముస్లిం సంఘాలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావుకు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ దశాబ్ద కాలం క్రితం నిర్వహణ లోపం వలన స్కూలును మూసివేశారని, శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాన్ని ఏడాది కిందట మున్సిపల్ కార్పొరేషన్ వారు కూల్చి స్థలాన్ని చదును చేశారని చెప్పారు. ఇటీవల స్కూలు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నారు. ఉర్దూ పాఠశాలను వెంటనే పునఃనిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. ముస్లింలు ఎక్కువగా నివసించే ఐదు డివిజన్‌ల మధ్యలో కోటావీధి ఉర్దూ స్కూల్ ఉందని అందరికీ అందుబాటులో ఉండేలా ఎక్కడైతే ఉర్దూ పాఠశాల స్థలం ఉందో అక్కడే నిర్మించాలని ముస్లిం నాయకులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఉర్దూ స్కూల్ పరిరక్షణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ కరిముల్లా, పఠాన్ కరిముల్లా ఖాన్, షేక్ మహ్మద్ రఫీ, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ హుస్సేన్, షేక్ సిలార్, షేక్ హిదాయతుల్లా, పఠాన్ సమీర్ ఖాన్, షేక్ ఆసిఫ్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు.


