ఆదిలాబాద్‌టౌన్: పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. ఆయా విభాగాలకు చెందిన 10 మంది స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించారు. సుమారు 250 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్, పెంచాల వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, సీఐలు ఫణిదర్, జి.శ్రావణ్, యశోద ఆస్పత్రి వైద్యులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం
బోథ్: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సొనాల మండలం గుర్రాలతండా గ్రామంలో శనివారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన 20 సీసీ మెరాలను ప్రారంభించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం 20 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం, సర్పంచులు దినేష్, ఎం.రమాదేవి, గ్రామ నాయక్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. బోథ్‌లో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నీలో విజేత జట్టుకు ఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. బోథ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులను ఎస్పీ అభినందించారు.


