మున్సి‘పోల్’కు సన్నద్ధం
కై లాస్‌నగర్: మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ అదే ఊపుతో ముందుకు సాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో బల్దియా ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించడంతో త్వరలోనే పట్టణ ఎన్నికలకు నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు షురూ చేశారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే రొటేషన్ విధానంలో ఎన్నికలు జరగనున్నప్పటికీ స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహించే ఈ ఎన్నికల్లో చైర్మన్‌ను నేరుగా ఎన్నుకునేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా దృష్టి సారించాయి.
పాత రిజర్వేషన్ల ప్రకారమే..
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలు సైతం అదే రిజర్వేషన్లతో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రొటేషన్ విధానం మార్చే అవకాశముంది. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్‌కు సన్నద్ధం కావాలని ఈసీని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అయిన ఆదిలాబాద్ పుర రాజకీయంపై అందరి దృష్టి పడింది.
నేరుగా చైర్మన్ ఎన్నిక..?
మున్సిపల్ పాలకవర్గ గడువు ముగిసి దాదాపు ఏడాది కావస్తోంది. జనవరి నెలాఖరులోగా ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించి ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సర్పంచ్‌ల తరహాలోనే ప్రత్యక్షంగా నిర్వహించనున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇదివరకు పరోక్ష విధానంలో కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించేది. కౌన్సిలర్లుగా ఎన్నికై న సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చైర్మన్‌ను ప్రత్యక్ష విధానంలో ఓటర్లే ఎన్నుకోవాలని భావిస్తోంది. పట్టణ పాలన సాఫీగా సాగడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడంలో చైర్మన్‌కు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయ పార్టీల గురి ..
మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలనే ప్రభుత్వం భావిస్తుండడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఆ దిశగా దృష్టి సారిస్తున్నాయి. పంచాయతీ పోరులో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకై క ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని కై వసం కోవాలని భావిస్తున్నాయి. చైర్మన్ పదవి కై వసం చేసుకోవడం ద్వారా రాజకీయంగా తమ ఆధిపత్యం చాటిచెప్పేలా పావులు కదుపుతున్నాయి. ఆ దిశగా గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే గెలుపుగుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. కాలనీల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలపై గళమెత్తే నాయకులను ఎంపిక చేసే దిశగా దృష్టి సారించాయి. ఇందుకోసం అన్ని పార్టీలు అంతర్గత సర్వేలు చేపడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున కౌన్సిలర్ టికెట్లను ఆశిస్తున్న అభ్యర్థులు ఆయా పార్టీల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఓటర్లను మచ్చిక చేసుకునేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో షెడ్యూల్‌కు ముందే రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది.
ఆదిలాబాద్ పట్టణ సమాచారం
జనాభా 1,80,000
వార్డులు 49
ఓటర్లు 1,04,159


