వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
కై లాస్‌నగర్: అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఆర్‌వోఎఫ్‌ఆర్ ప్రాంతాల్లో ఆక్రమణల విస్తరణను పూర్తిగా నిరోధించాలన్నారు. అటవీప్రాంతాల్లో అర్హత లేని సాగు భూములకు రైతుభరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలు రద్దు చేయాలన్నారు. అటవీ నేరాల నియంత్రణ కోసం పోలీసు, అటవీశాఖల అధికారులు సంయుక్తంగా దాడులు, కార్డన్‌సెర్చ్ నిర్వహించాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు సంబంధించి యజమానులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అడవుల్లో మేకలు, గొర్రెల మేత నిషేధించాలని కాపరులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు సూచించాలన్నారు. చెట్ల నరికివేత గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఆర్డీవో రవీందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, ఏవో వర్ణ, అటవీ క్షేత్ర అధికారులు గులాబ్ సింగ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తార్కిక జ్ఞానానికి గణితమే సోపానం
ఉట్నూర్‌రూరల్: గణితం విద్యార్థుల్లో తార్కిక శక్తి, ఆలోచన దృక్పథం పెంపొందించడంలో కీల క పాత్ర పోషిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన గణిత బోధనాభ్యసన సామగ్రి మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గణిత ఉపాధ్యాయుడు అజయ్, విద్యార్థులు సంయుక్తంగా తయారు చేసిన గణిత నమూనాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. పాఠశాలలోని కిచెన్ గార్డెన్ పరిశీలించి, ఆవరణలో మొక్క నాటారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో ఈ పాఠశాల రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులను అభినందించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్‌తో ఆంగ్లంలో సంభాషించడం ఆకర్షణగా నిలిచింది.
మీ బాల్యం ఎలా గడిచింది..
‘మీ బాల్యం ఎలా గడిచింది.. కలెక్టర్ కావాలనే లక్ష్యం ఎందుకు ఎంచుకున్నారు.. విద్యా విధానంలో ఎలాంటి మార్పులు అవసరం..’ అంటూ విద్యార్థులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు కలెక్టర్ చిరునవ్వుతో సమాధానాలిచ్చారు. వారి ఆత్మవిశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఇందులో సర్పంచ్ జాధవ్ విమలబాయి, హెచ్‌ఎం తిరుపతి, గణిత ఉపాధ్యాయులు అజయ్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.


