అర్జీలు సత్వరం పరిష్కరించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల అర్జీలు సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను పీవో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఆయా అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏవో దామోదరస్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
● ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామానికి బోర్‌వెల్ సౌకర్యం కల్పించాలని గిత్తే మనోహర్ దరఖాస్తు అందించాడు.
● తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి రోడ్లతోపాటు ఇళ్ల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు.
● ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నాడు.
● కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఆత్రం మాణిక్‌రావు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరాడు.


