పంచాయతీలకు ప్రత్యేక నిధులు
ఎస్‌డీఎఫ్‌తో ఆర్థిక చేయూత
సీఎం హామీపై సర్పంచుల్లో ‘నూతన’ ఉత్సాహం
గ్రామాల ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనే ఆశ
సమస్యల పరిష్కారానికి వెసులుబాటు
కై లాస్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ని ధులతో పాటు సీఎం ప్రకటించిన ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడం, మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపకరించనున్నట్లుగా పలువురు కొత్త సర్పంచులు చెబుతున్నారు. తద్వారా ప్రజలకిచ్చిన హామీలునేరవేర్చే అవకాశం లభించనుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.
వేధిస్తున్న నిధుల కొరత..
గ్రామ పంచాయతీలను ప్రస్తుతం నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సీ), రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నిధుల విడుదల సుమారు రెండేళ్లుగా నిలిచిపోయింది. దీంతో పంచాయతీ ఖజానాలో కాసుల్లేక కటకట నెలకొంది. తద్వారా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని దుస్థితి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శులు తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇక ట్రాక్టర్ల నిర్వహణ పూర్తిగా లోపించింది. ఈఎంఐలు కట్టలేని, డీజిల్ సైతం కొనలేని పరిస్థితి. ఇలా అవస్థల నడుమ సాగుతున్న పంచాయతీలకు నూతన పాలకవర్గాలు రావడంతో పెండింగ్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలకానున్నాయనే ఆలోచన ఆనందాన్ని కలిగిస్తోంది.
పాలకవర్గాల్లో ఆశలు..
మేజర్ పంచాయతీకి రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షలను స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) కింద అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో బేల, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్ వంటి ఐదు మే జర్ పంచాయతీలున్నాయి. వీటికి తోడు మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీలను సైతం మేజర్ పంచాయతీలుగా పరిగణించవచ్చు. ఈ లెక్కన 20 మండల కేంద్రాలు, ఐదు మేజర్ పంచాయతీలు కలిపి 25 వరకు పెద్ద పంచాయతీలున్నాయి. వీటికి రూ.10లక్షల చొప్పున రూ.2.50 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశముంది. మిగతా 448 గ్రామ పంచాయతీలు చిన్న పంచాయతీలే. ఇందులో 228 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డవే. వీటికి ఎలాంటి ఆదాయ వనరుల్లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మౌలిక సౌకర్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి రూ.5లక్షల చొప్పున ఇస్తామనే సీఎం ప్రకటనతో అక్కడి పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వీటికి గాను జిల్లావ్యాప్తంగా రూ.22.40 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో పంచాయతీలకు అదనపు ఆర్థిక భరోసా కలిగి సమస్యల పరిష్కారానికి అవకాశముంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రత్యేక నిధుల విడుదలతో పంచాయతీల ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుందని నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
జిల్లాలో
గ్రామ పంచాయతీలు 473
మేజర్ గ్రామ పంచాయతీలు 05
మండల కేంద్రాలు 20
చిన్న గ్రామ పంచాయతీలు 448
ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం.. ఇందుకోసం చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలను సీఎం నిధుల నుంచి నేరుగా పంచాయతీలకే అందిస్తా.. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి.. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 24న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో చేసిన ప్రకటన. దీనిపై నూతన పంచాయతీ పాలకవర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నిధుల లేమితో సతమతమవుతున్న జీపీల్లోని సమస్యల పరిష్కారానికి కొంత వెసులుబాటు కలగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


