● ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయ పరిస్థితి ● డీఎస్పీ, ఇన్‌స్
ఆదిలాబాద్ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) కార్యాలయం.. ఓ డీఎస్పీస్థాయి అధికారి, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, రైటర్.. ఇలా మొత్తం 14 మందితో ఆఫీస్ నిత్యం సందడిగా ఉండే ది. అయితే ఇది ఇక గతమే. ప్రస్తుతం అధికారులతో పాటు కొంత మంది కానిస్టేబుల్ పోస్టులను మంచిర్యాలకు తరలించేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ సైతం పూర్తయింది. ఇక్కడ కేవలం ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఈ కార్యాలయం ప్రాభవాన్ని కోల్పోయింది. ఆఫీసు ఉందా అంటే.. ఉంది అన్నట్టుగా మారింది. – సాక్షి,ఆదిలాబాద్
ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయం
మంచిర్యాలకు తరలిపోయాయి..
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో ఈనెల 19న ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని అక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నస్పూర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కూడా అక్కడికే తరలించారు. ఇక ఆదిలాబాద్‌లో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. పదేళ్ల కేసులను పరిశీలిస్తే.. మంచిర్యాల ప్రాంతం నుంచే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆ రోజు డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు.
సేవలు అందుబాటులోనని చెబుతూ..
ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయం నుంచి ప్రధాన పో స్టులను మంచిర్యాలకు తరలించిన విషయంలో ఇప్పటికీ అధికారులు స్పష్టంగా పేర్కొనడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణం దృష్ట్యా మంచి ర్యాల, కుమురంభీం జిల్లాలకు కలిపి మంచిర్యాల కార్యాలయం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆదిలాబాద్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడి కార్యాలయం కూడా డీఎస్పీ పర్యవేక్షణలోనే కొనసాగుతుందని పేర్కొంటున్నారు. ఆదాయ దాడులు కాకుండా ప్రత్యక్ష దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో నిందితుడిని 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ రేంజ్‌కు సంబంధించి కేసుల్లో నిందితులను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ క్రమంలో సమయభావం, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకొని డీఎస్పీ ప్రధాన కార్యాలయం మంచిర్యాలలో, అలాగే ఆదిలాబాద్‌లో సేవలు అందుబాటులో ఉండేలా కానిస్టేబుళ్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
విస్తృత దాడుల నేపథ్యంలో..
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏసీబీ విస్తృత దాడులు నిర్వహిస్తోంది. అనేక మంది ఉన్నతాధికారుల అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేవలు మరింత పెంచాల్సి ఉండగా, వాటి స్థాయి తగ్గించడం ఏవిధంగా సబబనే ప్రశ్న తలెత్తుతోంది. కనీసం ఇన్‌స్పెక్టర్ స్థాయి పోస్టు కూడా ఆదిలాబాద్‌లో అందుబాటులో ఉంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం తాము మంచిర్యాలలో ఉన్నా.. ఎక్కడున్నా.. బాధితుల ఫిర్యాదు అందిన తర్వాత డీఎస్పీ స్థాయి అధికారి నుంచి మొదలుకుంటే అందరూ రంగంలో ఉంటారని, ఇటీవల నిర్మల్ జిల్లా కడెంలో మండల సర్వేయర్‌ను పట్టుకున్న కేసే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. అయితే అధికారుల పోస్టులు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఫిర్యాదు విషయంలో కొంత వెనుకంజ వేసే అవకాశం లేకపోలేదు. ఆ సమయంలో మంచిర్యాల వరకు వెళ్తారా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయం ద్వారా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు అవినీతి నిరోధక శాఖ పరంగా పూర్తిస్థాయిలో సేవలు కొనసాగుతాయి. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆదిలాబాద్ కార్యాలయంలో ప్రతిరోజు ఉద్యోగుల హాజరుకు సంబంధించి కూడా పర్యవేక్షణ నేనే చేస్తున్నాను. ఫిర్యాదుల విషయంలో కూడా తక్షణం స్పందిస్తున్నాం. అవినీతికి సంబంధించి శాఖ అధికారులకు సమాచారాన్ని ప్రజలు ఎలాంటి సందేహాం లేకుండా అందించాలి.
– పి.విజయ్‌కుమార్, డీఎస్పీ, ఏసీబీ
● ఆదిలాబాద్ ఏసీబీ కార్యాలయ పరిస్థితి ● డీఎస్పీ, ఇన్‌స్


